మహేశ్వరం నియోజకవర్గ పరిధి లో ఇంత వరకు టీఆరెస్ గెలిచింది లేదు . మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడిన తరువాత తొలిసారిగా సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున గెల్చి , వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గం లో హోంశాఖ మంత్రిగా వ్యవహరించారు . ఇక రెండవసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరుపున గెల్చిన తీగల కృష్ణారెడ్డి , ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యం లో టీఆరెస్ తీర్ధం పుచ్చుకున్నారు . ఇక గత ఏడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీగల కృష్ణారెడ్డి పై సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు .

 

ఇక ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యం లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ వీడి , టీఆరెస్ పార్టీ లో చేరడమే కాకుండా , కేసీఆర్ కేబినెట్ లో తొలిమహిళా మంత్రిగా స్థానం సంపాదించారు . సబితా ఇంద్రారెడ్డి చేరిక తో మహేశ్వరం నియోజకవర్గం లో టీఆరెస్ కు తిరుగులేదని అందరూ  భావించారు . అయితే తాజాగా జరిగిన  మున్సిపల్ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రెండు కార్పొరేషన్ల  లో , రెండు  మున్సిపాలిటీ లలో  టీఆరెస్ చావుతప్పి కన్ను లొట్టబోయినట్లుగా విజయం సాధించింది .

 

జల్ పల్లి మున్సిపాలిటీ ని మజ్లీస్ కైవసం చేసుకోగా , తుక్కుగూడ మున్సిపాలిటీ లో   మెజార్టీ స్థానాలలో  బీజేపీ విజయం సాధించినప్పటికీ , టీఆరెస్ నాయకత్వం ఎక్స్ అఫిషియో ఓట్ల ఆధారంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాన్ని దక్కించుకుంది . రాష్ట్రం లో ఎక్కడలేని విధంగా , ఈ మున్సిపాలిటీ లో టీఆరెస్ ఐదుమంది ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లను వినియోగించుకుంది . ఇక బడంగ్ పేట కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తరుపున గెల్చిన కార్పొరేటర్ ను తమ పార్టీ లో చేర్చుకుని మేయర్ స్థానాన్ని కట్టబెట్టగా , మీర్ పేట కార్పొరేషన్  లో ఇండిపెండెంట్ల సహకారం తో మేయర్ స్థానాన్ని దక్కించుకుంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: