జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలోని తారా ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఫ్యాక్టరీలోని సిబ్బంది బయటకు పరుగులు తీయడంతో వారంతా ఎటువంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారు. ఈ భారీ అగ్నిప్రమాదంలో ఎగసిపడుతున్న పొగలు సమీపంలోనున్న మూడు గ్రామాలను చుట్టుముట్టాయి. దీంతో ఈ మూడు గ్రామాలకు చెందిన వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దురదృష్టవశాత్తు, ఫ్యాక్టరీ కి దగ్గరలోనే కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాల ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగిన తారా ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో రంగులు తయారు చేస్తారని తెలుస్తోంది. ఐతే, ఈ ఫ్యాక్టరీలో రంగులకు సంబంధించిన పెద్ద డ్రమ్ములలో కిరోసిన్ కి బదులు టిన్నర్ తో నింపి నిల్వ చేస్తారు. ఇలా నిల్వచేసిన డ్రమ్ములు ఒక్కోటిగా భారీ శబ్దం తో పేలిపోయి మంటలను ఇంకా పెంచుతూ పోతున్నాయి. అందుకే, ఈ మంటలను అదుపులోకి తేవటానికి జనగామ లో ఉన్న ఫైరింజన్లు సరిపోక వరంగల్ కు చెందిన ఫైరింజన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.



అగ్నిప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ అని సమాచారం. ఫ్యాక్టరీలో పని చేస్తున్న వర్కర్లు రియాక్టర్ లకు చార్జింగ్ పెడుతున్న సమయంలో... షార్ట్ సర్క్యూట్ జరగగా... నిప్పురవ్వలు రావడంతో.. ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఇక్కడ తయారు కాబడిన రంగులు హైదరాబాద్, ఇంకా ఇతర ప్రాంతాలకు తరలించబడతాయి. అయితే, ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే.. ఆ ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఈ ఫ్యాక్టరీ లో ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేవని తెలుస్తోంది. అందుకే ఇటువంటి భారీ అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఫ్యాక్టరీని కస్తూరిబా బాలికల గురుకులం దగ్గరలోనే నడపవద్దని పలుమార్లు ఆ పాఠశాల ఇబ్బంది ఉన్నత అధికారులకు చెప్పినా.. వారు పట్టించుకోలేదని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: