టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న ఒకే ఒక నిర్ణయం వలన టీడీపీ యంగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు అజ్ఞాత‌వాసిగా మారిపోయారు. ఎప్పుడు ఏదొక అంశం మీద ఇటు ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద, అటు లోక్ సభలో కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించే రామ్మోహన్...ఇప్పుడు ఒక అంశం మీద నోరు మెదపలేకపోతున్నారు. అలా రామ్మోహన్ నాయుడుని అజ్ఞాతవాసిగా మార్చేసిన ఇష్యూ...మూడు రాజధానులు. రాజధానిగా అమరావతి పెద్దగా అనుకూలంగా లేకపోవడం, అక్కడ టీడీపీ నేతలు విపరీతంగా ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడటం, పైగా హైదరాబాద్ మాదిరిగా ఒకేచోట అభివృద్ధి కేంద్రీకృతం అయితే ప్రాంతీయ అసమానతలు వస్తాయనే ఉద్దేశంతో సీఎం జగన్, మూడు రాజధానులుని  తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

 

విశాఖపట్నం పరిపాలన, అమరావతిలో శాసనసభ, కర్నూలులో హైకోర్టు రాజధానులుగా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ నిర్ణయాన్ని టీడీపీ పూర్తిగా వ్యతిరేకించింది. చంద్రబాబు, ఆ పార్టీ నేతలు అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలంటూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ బలం ఉపయోగించుకుని మండలిలో మూడు రాజధానుల బిల్లుకు తాత్కాలిక బ్రేక్ వేశారు. ఇక ఇక్కడ నుంచే జనాల్లో టీడీపీ మీద మరింత వ్యతిరేకిత పెరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో టీడీపీ మీద నెగిటివ్ వచ్చింది.

 

ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహాన్ నాయుడు, దీనిపై ఎలాంటి స్పందన తెలియజేయలేక సైలెంట్ అయిపోయారు. పూర్తిగా అమరావతికి మద్ధతుగా లేదా మూడు రాజధానులకు వ్యతిరేకంగా గానీ మాట్లాడలేకపోతున్నారు. ఆఖరికి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తలు టీడీపీకి వ్యతిరేకంగా నిరసనలు, చంద్రబాబు దిష్టి బొమ్మలని దగ్ధం చేస్తుంటే, వాటిపై పోలీసులకు ఫిర్యాదులు చేయగలుగుతున్నారు తప్ప, పూర్తిగా అమరావతికి  మద్ధతుగా మాట్లాడటం లేదు. ఒకవేళ అలా మాట్లాడితే జిల్లాలో ఎక్కడ యాంటీ పెరిగిపోతుందనే ఉద్దేశంతో రామ్మోహన్..పవన్ కల్యాణ్ ఫ్లాప్ సినిమా ‘అజ్ఞాతవాసి’ టైటిల్ మాదిరిగా ఉండిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: