కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ఏపీకి కేటాయించే పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వంపై ఉన్న వైఖరి ఏంటనేది స్పష్టంగా తెలియనుంది. ఇప్పటికే దుగ్గరాజుపట్నం ఓడరేవుకు సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి రామాయపట్నం ఓడరేవు నిర్మించాలని భావించారు. కానీ 2013లో దుగ్గరాజుపట్నం ఓడరేవును నిర్మించాలని నిర్ణయించారు.

 

తాజాగా ఓడరేవు నిర్మాణానికి దుగ్గరాజుపట్నం అంతా అనుకూలంగా ఉండదని, బందరులో నిర్మించే ఆలోచనలో ఉన్నట్టూ ప్రచారం జరిగింది. కానీ ఓడరేవు నిర్మాణం కేంద్రం ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తుండడంతో సందిగ్ధత నెలకొంది. ఓడరేవు నిర్మాణం పూర్తయ్యి అందుబాటులోకి వస్తే.. లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రాజెక్టుపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ కేంద్రం ఈ బడ్జెట్ లోనైనా నిధులు కేటాయిస్తుందా లేదా అన్న విషయంపై ఏపీవాసులు గుబులు రేపుతోంది.

 

ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీల్లో భాగంగా దుగ్గరాజుపట్నం ఓడరేవును కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఏపీవాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. కానీ విభజన అనంతరం జరిగిన పరిణామాల్లో ఏపీ ప్రభుత్వానికి దాదాపు ప్రతి విషయంలోనూ మొండి చేయి  చూపిందనే చెప్పాలి.  వాస్తవానికి ఏపీలో 970 కిలోమీటర్ల మేర కోస్టల్ లైన్ తో పాటు నాలుగు ఓడరేవులు, ఆరు విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి.  వీటితో పాటు మంచి వనరులు పుష్కలంగా ఉన్నాయి.

 

ఓడరేవులు, విమానాశ్రయాల్లో సరైన రీతిలో పెట్టుబడులు పెడితే స్వర్గధామంగా మారడం ఖాయం. ఆ దిశగా కేంద్రం పెట్టుబడులు పెడుతుందనే అందరూ భావించారు. కానీ ఆ పరిస్థితులు కాస్త తిరోగమనంలో కన్పిస్తున్నాయి. ఇదిలావుంటే.. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయించే పెట్టుబడులపైనే ఏపీ భవితవ్యం ఏంటనేది తేలనుంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి సహకరిస్తుందా.. గతంలో మాదిరిగానే మొండి చేయి చూపిస్తుందా అనే తేటతెల్లంకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: