ఆంధ్ర ప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు , తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని కాంగ్రెస్ , బీజేపీ లు తీవ్రంగా పరిగణిస్తున్నాయి . ఈ విషయాన్ని తేల్చుకునేందుకు బీజేపీ హస్తిన బాట పడుతోంది . రాజ్యసభ చైర్మన్ , భారత ఉపరాష్ట్రపతి ని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది . ఈ మేరకు శనివారం ఢిల్లీ కి వెళ్లి భారత ఉప రాష్ట్రపతిని కలిసి , కేశవరావు ఓటు హక్కు వినియోగం పై ఫిర్యాదు చేస్తామని కమలనాథులు తెలిపారు .

 

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్ ఎన్నికల్లో కేవీపీ రామచంద్రరావు , కేశవరావు ఇద్దరు ఓటు హక్కు వినియోగం పై తీవ్ర దుమారం నెలకొన్న విషయం తెల్సిందే . రాష్ట్ర విభజన సందర్బంగా కేవీపీ ని తెలంగాణ కు , కేశవరావు ను ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించారు . అయితే ఇద్దరు కూడా తమకు తెలంగాణలోనే ఎక్స్ అఫిషియో ఓటు హక్కు ఉందని గట్టిగా వాదిస్తున్నారు . కేశవరావు తుక్కుగూడ మున్సిపాలిటీ లో ఓటు హక్కు వినియోగించుకోగా , కేవీపీ మాత్రం కాంగ్రెస్ చైర్ పర్సన్ ఎన్నికను బహిష్కరించడం తో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు .

 

ఒకవేళ ఇద్దరు ఓటు హక్కు వినియోగించుకుని ఉంటే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారి ఉండేది .  మరొకవైపు  ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన   కేశవరావు కు తెలంగాణ లో ఓటు హక్కు కల్పించడం పట్ల కాంగ్రెస్ , బీజేపీ లు ఎన్నికల సంఘాన్ని కలిసి తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి . దీనితో ఎన్నికల సంఘం, వీరిద్దరి విషయం లో స్పష్టతనివ్వాలని రాజ్యసభ సచివాలయానికి అధికారికంగా లేఖ రాసింది . కేవీపీ తెలంగాణ రాజ్యసభ సభ్యునిగా రాష్ట్ర  ప్రభుత్వం అధికారికంగా ముంద్రించిన 2020 డైరీ లో పేర్కొనగా, ఇక రాజ్యసభ వెబ్ సైట్ లోను అదే విషయాన్ని వెల్లడించడం జరిగింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: