తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ ఎమ్మార్వో ఆఫీసులో ఓ వ్యక్తి వీరంగం చేశాడు. ఓ భూమికి సంబంధించిన పట్టా చేయడం కోసం తనను ఏడాదిన్నరగా తిప్పుతున్నారంటూ అతడు ఆరోపించాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం (జనవరి 31) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి ఆఫీసులోని రెవెన్యూ సిబ్బంది పై ఆ వ్యక్తి దాడికి యత్నించాడు. కార్యాలయం లోని ఫర్నీచర్‌ ను ధ్వంసం చేయటంతో ఒక్కసారిగా అధికారులకు ముచ్చెమటలు పట్టేశాయనుకోండి. 


అసలు వివరాల్లోకి వెళితే.. శ్రీనివాసరావు అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం ఎడవల్లి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చాడు. కుర్నాపల్లి శివారులోని సర్వే నంబర్‌ 127, 128, 129లో ఉన్న భూములను తమ బంధువుల పేరు పై పట్టాలు చేసి పాస్‌ బుక్‌ లు ఇవ్వాలని వారిని డిమాండ్‌ చేశాడు. అందుకు రెవెన్యూ  అధికారులు కుదరదని చెప్పడంతో.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిబ్బంది పై దాడికి తెగ బడ్డాడు. దీనిని ఆదుకున్న వీఆర్‌వో పై దాడి చేశాడు. కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశాడు.

 

పట్టా చేయాలని కోరుతుంటే అధికారులు ఏడాదిన్నరగా తిప్పుకుంటున్నారని శ్రీనివాస్‌ రావు మండిపడ్డాడు. రెవెన్యూ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

 

అయితే.. గతంలో హైదరాబాద్‌ లోని అబ్దుల్లాపూర్‌ మెట్‌ లో తహసీల్దార్ విజయా రెడ్డి దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే.. ఈ ఘటన అనంతరం ఎమ్మార్వో సిబ్బందిని బెదిరింపులకు గురిచేస్తున్న ఘటనలు ఎక్కువే అయ్యాయి. మరో వైపు అవినీతిలోనూ రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఎమ్మార్వో సిబ్బంది తమ తీరు మార్చుకోవాలని.. తమపై దాడులు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: