ఏపీలో మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళనలు ఆగడం లేదు. అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తామంటూ టీడీపీ ప్రకటించిన సమయంలో అభ్యంతరం చెప్పని వైసీపీ ఇప్పుడు మూడు రాజధానులు అంటూ ప్రకటించడంతో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికే అమరావతి కేంద్రంగా ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సెగ దేశ రాజధాని ఢిల్లీకి కూడా తగలబోతోంది.


ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని రద్దు చేసేలా చూడాలంటూ రైతు జేఏసీ నేతలు ఢిల్లీకి బయలుదేరారు. ఏపీలోని గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన వీరు హస్తినలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు అన్యాయం అవుతారంటూ ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాతో పాటు మరో 10 మంది కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. 


రాజధానిని అమరావతిలోనే ఎందుకు కొనసాగించాలి, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే కలిగే ఇబ్బందులు, రైతులకు జరిగే నష్టాన్ని కేంద్రానికి విన్నంచాలని భావిస్తున్నారు. దీంతో పాటు ఆందోళన చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును కూడా కేంద్రానికి చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ఇద్దరు జేఏసీ నాయకులకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. వీరు ఈ రోజు సాయంత్రం గానీ, రేపు ఉదయం గానీ ప్రధాని, హోంమంత్రిని కలిసే అవకాశం ఉంది. ప్రధాని, హోంమంత్రి అపాయింట్ మెంట్ ఇచ్చేలా ఏపీకి చెందిన బీజేపీ నేతలు సహకరించినట్లు తెలుస్తోంది. ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా జేఏసీ నేతలు అవసరమైతే పార్లమెంట్ ముందు కూడా ఆందోళన నిర్వహించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: