నేటి రాజకీయాలను ఒక్క సారి పరిశీలిస్తే, పూర్తి స్వార్ధంతో నిండి ఉన్నాయనిపిస్తుంది. ఒక మనిషి తినేది పిడికెడు మెతుకులు, ఒకవేళ పోతే నాలగడుగుల నేల. దీనికోసం బ్రతికినంత కాలం అవినీతిని అడ్డాగా చేసుకుని, అడ్దమైన పనులు చేస్తూ, అడ్దగోలుగా సంపాదిస్తూ, ఎదుటివారి శాపనార్ధాలను వెంటే ఉంచుకుంటాడు. నాటి రాజకీయ జీవితానికి, నేటి రాజకీయం పూర్తిగా విరుద్దంగా ఉంది. ఒకరకంగా ఇది మానవ మనుగడకే పెను ప్రమాదం. ఇకపోతే దేశానికి కానీ రాష్ట్రానికి గానీ  అనుభవం కలిగిన సీనియర్ల యుక్తితోపాటు నెత్తురు మండే యువశక్తీ అవసరమే.

 

 

కానీ వారికున్న అనుభవం అంతా అవినీతి, అరాచక రాజకీయాలకే ఉపయోగిస్తున్నారు. ఇకపోతే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజలకు కలిగే ఇబ్బందులు అన్ని ఇన్నికావు. కొత్తగా వచ్చిన నాయకుడు కొత్త పధకాలను ప్రవేశపెడితే, అప్పటివరకు ఉన్న పధకాలు అటకెక్కుతాయి. మరి వాటికోసం పెట్టిన ఖర్చులన్నీ వృధానే. ఇదంతా ప్రజల నెత్తిమీదనే భారంగా మారుతుంది. ఇలా ఆలోచిస్తే రాజకీయ చరిత్ర గురించి మట్టిలోని ప్రతి రేణువు చెబుతుంది. ఇక తాజాగా ఏపీలో నెలకొన్న పరిస్దితులను చూస్తుంటే వచ్చేదెంతో, పోయేదెంతో తెలియదు గానీ మూడు రాజధానుల పేరు చెప్పి రాజకీయనాయకులు లాభం మాత్రం పొందుతున్నారు.

 

 

ఇక్కడే ఒక నిర్ధిష్టమైన ఆలోచన లేకుండా నాయకులు ప్రవర్తిస్తున్నారు..  జై అమరావతి అని కొందరంటే, కొందరు మూడు రాజధానులకి సమ్మతం అని తలలు ఊపుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు రాష్ట్రంలో ఇదొక్కటే సమస్య అన్నట్లుగా ప్రవర్తిస్తున్న నాయకులు, ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. సమయాన్ని కరింగించేస్తూ, ఎంతసేపూ మూడు రాజధానులు వద్దు అని టీడీపీ, మూడు రాజధానులు ముద్దు అని వైసీపీ నేతలు అంటున్నారే తప్ప, రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి అన్న భాధ ఒక్కరికి లేదు..

 

 

 ముఖ్యంగా ఇక్కడ ఎవరు అవినీతి ఎక్కువగా చేశారు అని నిందించుకోవడం, నిరూపించుకోవడానికే ప్రభుత్వాలు పని చేస్తున్నట్లుగా అనిపిస్తుందే తప్పితే ప్రజా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది. ఇంతవరకు జరిగిన అభివృద్ధి ఎంతవరకు వచ్చింది లాంటి విషయాలు ఒక్కరు కూడా ఆధారాలతో సహా నిరూపించుకోలేకపోతున్నారు.. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ఖజానా లో నుండి డబ్బుని ఈ ప్రాజెక్ట్ కి పెట్టి, కేంద్రానికి బిల్లు పెట్టగా...

 

 

మోడీ ప్రభుత్వం ... ప్రాజెక్ట్ కి న్యాయంగా ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వకుండా ...మీరు చూపించే లెక్కలు సరిగా లేవు అంటూ పోలవరం నిధుల్ని విడుదల చేయకుండా మోసం చేస్తుంది. మొత్తంగా వైసీపీ ప్రభుత్వమే పోలవరం ఆపేసింది అని టీడీపీ ...టీడీపీ చేసిన అవినీతి వల్లే పోలవరం ఆగింది అంటూ వైసీపీ విమర్శలు చేస్తుంది..ఈ విధంగా మూడు పార్టీలు కూడా ఏపీ అభివృద్ధితో  ఆడుకుంటున్నాయి అని  రాజకీయ మేధావులు అనుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: