2020-21 వార్షిక బడ్జెట్ లో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ మేకిన్ ఇండియాను ప్రోత్సహించే విధంగా  నూతన పథకాలను ప్రతిపాదించారు . పాలు , మాంసం , చేపలు వంటి వాటి రవాణా కోసం కిసాన్ రైల్  ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు .  ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం తో (పీపీపీ ) ఈ రైల్ ను రైల్వే శాఖ ప్రారంభించనుంది . ఆహార పదార్ధాల రవాణా కోసం ప్రత్యేక రైళ్లలో ప్రత్యేక  శీతల బోగీలను ఏర్పాటు చేయనున్నారు . ఇక కృషి ఉడాన్  పేరిట గ్రామీణ ప్రాంతాల్లో పండే పూలు , కూరగాయలు , పండ్ల ఎగుమతుల కోసం ప్రత్యేక విమానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు నిర్మలాసీతారామన్ తెలిపారు .

 

పౌర విమానయాన శాఖ ఈ ప్రత్యేక విమానాల్ని  నడిపించనుంది  . మహిళా స్వయం సహాయక సంఘాల అద్వర్యం లో గిడ్డంగులను నిర్వహించేందుకు వీలుగా ధాన్యలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చారు . గ్రామీణ ప్రాంతాల్లో పండించే పంటలను రైతులు ఈ గిడ్డంగుల్లో నిల్వ చేసుకునే వెసులుబాటు లభించనుంది . ప్రత్యక్ష పన్నులు చెల్లింపుల్లో ఫిర్యాదులను తగ్గించేందుకు వివాద్ సే విశ్వాస్ పేరిట ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చారు నిర్మలాసీతారామన్ . పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు  ఏ స్థాయి లో పెండింగ్ లో  ఉన్న ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు . ఫోన్ల తయారీ కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు ఆర్ధికమంత్రి తెలిపారు . ఈ పథకం పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు .

 

మొబైల్ ఫోన్లు , ఎలక్ర్టానిక్ ఉత్పత్తులు , సెమీ కండక్టర్లు , వైద్య పరికరాలు దేశీయంగా తయారుచేయడానికి అవసరమైన పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ఈ పథకం ఉంటుందని నిర్మలాసీతారామన్ తెలిపారు .  చిన్న తరహా ఎగుమతిదారులకు రక్షణ గా నిలిచేందుకు నిర్విక్ పేరుతో  కొత్త పథకాన్ని ప్రకటించారు . ప్రతి జిల్లాను ఒక ఎక్స్ పోర్ట్ హబ్ గా మార్చాలన్న ఉద్దేశ్యం తో ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు ఆర్ధికమంత్రి తెలిపారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: