సమన్యాయం... ఎవరైనా కోరుకునేది ఇదే. కమ్యునిస్టులు పార్టీలు ఏలుతున్న ప్రపంచంలోని అతి పెద్ద దేశంలో దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఆ దేశమే వివక్షకు గురవుతోంది. అమెరికా, రష్యాల రేంజ్‌లో మిలిటరీ ఉన్న చైనా.. ఆ దేశ ప్రజలు వివక్ష ఎదుర్కోడానికి కారణాలేంటి..? వారి ఆహరపు అలవాట్లే ప్రస్తుత పరిస్థితికి కారణమా..?  

 

చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ఆదేశంపై అంతర్జాతీయంగా విద్వేషం పెరిగేలా చేస్తోంది. ఆ విష మహమ్మారి ఇతర దేశాలకూ వేగంగా వ్యాపిస్తుండటమే ఆ విద్వేషానికి కారణమవుతోంది. దీంతో.. ప్రపంచంలోని పలు దేశాల్లో చైనీయులకు వ్యతిరేకంగా వివక్ష జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఆ దేశస్థుల పర్యటనలు నిషేధించడం, వారిని రెస్టరెంట్లలోకి రానివ్వకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. 

 

చైనీయులు మాత్రమే కాకుండా పలు ఆసియా ప్రాంతాలకు చెందిన వారిపైనా ఈ ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్‌, హాంగ్‌కాంగ్‌, వియత్నాంలోని రెస్టరెంట్లు చైనీస్‌ కస్టమర్ల ప్రవేశానికి నిరాకరిస్తున్నాయి. మరోవైపు ఐరోపా, యూఎస్‌లోనూ చైనా సహా ఇతర ఆసియా దేశాల వారు కరోనా కారణంగా వివక్షకు గురవుతున్నారు.  

 

చైనీస్ ఆహారపు అలవాట్లపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తోంది దక్షిణకొరియా. సోషల్ మీడియాతో పాటు ప్రచార మాధ్యమాల్లో సైతం నేరుగా విమర్శలు కురిపిస్తోంది. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వ్యాఖ్యలను నివారించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు చైనీయులు. సియోల్‌లోని ప్రముఖ సీఫుడ్‌ రెస్టారెంట్‌ ఏకంగా చైనీయులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టేసింది. చైనా పర్యాటకులను నిరాకరించాలని 6లక్షల మంది దక్షిణకొరియా పౌరులు ప్రభుత్వానికి దరఖాస్తు చేశారంటే తెలుసుకోవచ్చే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో..! 

 

అదేవిధంగా.. హాంకాంగ్‌లోని పలు హోటళ్లే చైనీయులకు ఆహారం సరఫరా చేసేందుకు నిరాకరిస్తున్నాయి. ఆ దేశంలో ఎక్కడ చూసినా కస్టమర్ల కోసం మేము చైనీయుల ప్రవేశానికి నిరాకరిస్తున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. డానిష్‌కు చెందిన ఓ వార్తా పత్రిక చైనా జాతీయ పతాకంలోని చుక్కలతో వైరస్‌ కార్టూన్‌ను ప్రచురించింది. దీనిపై తీవ్రంగా మండిపడింది చైనా దౌత్య కార్యాలయం. దేశాన్ని కించపరచడం తగదని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇలా పలు చోట్ల చైనీయులపై వివక్ష రేకెత్తుతుండటం వారి దయనీయ పరిస్థితిని స్పష్టం చేస్తోంది. 

 

మరోవైపు.. చైనాలో కాకుండా దాదాపు 24 దేశాల్లో కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. అయితే, ఫిలిప్పీన్స్‌లో మాత్రమే ఆ వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు. మొత్తంగా కరోనా వైరస్‌పై ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న తీరు చైనాకు వాణిజ్య, రాజకీయ, దౌత్య పరంగా వివాదాలుగా మారుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: