మేడారం.. ప్రపంచంలో అరుదైన జాత‌ర‌.. త‌మ‌కోసం ప్రాణాలు అర్పించిన వీరుల‌ను స్మరించుకునే అపురూప సంద‌ర్భం. స‌మ్మక్క, సార‌ల‌మ్మ, జంప‌న్నల చుట్టూ ఎన్నో వీర‌గాథ‌లు ఉన్నాయి.  క‌ప్పం క‌ట్టబోమ‌ని తెగేసి చెప్పి యుద్ధంలో అసులువులు బాసిన వీరుల‌ను ఆదివాసీలు అనాదిగా స్మరిస్తూ వ‌స్తున్నారు. నేడు ఆ వీరులు వ‌న‌దేవ‌త‌లై, శ‌క్తిస్వరూపిణులై  అశేష‌భ‌క్తజ‌నం చేత పూజ‌లందుకుంటున్నారు. స‌మ్మక్క-సార‌ల‌మ్మను ద‌ర్శించుకుంటే త‌మ క‌ష్టాలు తొలిగిపోతాయ‌ని భ‌క్తుల విశ్వాసం.

 

 

మేడారంకు చెందిన పగిడిద్దరాజుతో సమ్మక్క వివాహం జరిగింది. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలు సంతానంగా కలిగారు. కరువు కారణంగా కప్పం కట్టలేదని కాకతీయరాజు ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై యుద్ధం ప్రకటించాడని చరిత్ర చెప్తోంది. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ వీరమరణం పొందారు. ఈ పరాజయాన్ని తట్టుకోలేక సమ్మక్క కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది. ఈ యుద్ధంలోనే వీరోచితంగా పోరాడిన సమ్మక్క తీవ్ర గాయాలపాలైంది. దీంతో రక్తధారలు కారుతూండగానే యుద్ధభూమి నుంచి చిలుకలగుట్ట వైపు వెళ్తూ అదృశ్యమైందని చరిత్ర చెప్తోంది. అక్కడే ఓ పుట్ట వద్ద లభించిన కుంకుమ భరిణెనే సమ్మక్క ప్రతిరూపంగా భావించారని ప్రతీతి. దీంతో ప్రతి రెండేళ్లకోసారి మేడారంలో జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జాతరకు దాదాపు 900 సంవత్సరాల చరిత్ర ఉంది.

 

 

అయితే.. ఈ జాతరకు చారిత్రక ఆధారాలు లేవని కూడా అంటున్నారు. నిజానికి ప్రతాపరుద్రుడు యుధ్దం ప్రకటించేటంత కర్కశ నిర్ణయం తీసుకుని ఉండడని చరిత్రకారులు అంటున్నారు. సమ్మక్క కుటుంబీకుల వీరోచిత యుద్ధానికి కూడా ఆధారాలు లేవని అంటున్నారు. గిరిజన జాతరలు అన్నీ అడవిలోనే జరిగేవని అంటున్నా.. సమ్మక్క-సారలమ్మ జాతర మాత్రం అనాదిగా వస్తోంది. అమ్మ మహిమలను భక్తులు అత్యంత విశ్వాసంతో జరుపుకుంటున్నారు. చారిత్రక ఆధారాలు లేకపోయినా అనాదిగా మహిమలు కలిగిన అమ్మ జాతరను జరుపుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: