తెలంగాణ రాష్ట్రంలో మేడారం మహా జాతరకు ఏర్పాట్లు అన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. రేపటినుండి మేడారం సారలమ్మ మహా జాతర ప్రారంభం కానుంది. మేడారం మహా జాతరకు కోటీ 50 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఉనుగొండ్ల నుండి పడిగిద్దరాజును తీసుకురానున్నారు. 
 
రేపు గద్దెలపైకి సారలమ్మ రానున్నారు. గోవిందరాజును ఏటూరి నాగారం మండలం కొండాయ నుండి తీసుకొనిరానున్నారు. అమ్మవార్ల దీవెనల కోసం లక్షలాది మంది ఇప్పటికే మేడారం చేరుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ప్రభుత్వం ఈ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం మేడారం జాతర కొరకు 75 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి ప్రజలకు సకల సౌకర్యాలను కల్పించింది. 
 
ములుగు జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారి ఈ జాతర జరుగుతూ ఉండటం గమనార్హం. మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని ప్రభుత్వం భక్తులకు అందిస్తోంది. 8,400 టాయిలెట్లను ప్రభుత్వం తాత్కాలింగా నిర్మించింది. వీఐపీల కొరకు, వీవీఐపీల కొరకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ప్రభుత్వం ప్రయాణికుల అవసరాల కొరకు 4,000 బస్సులను అందుబాటులో ఉంచింది. 
 
12,000 మంది సిబ్బంది ప్రత్యేకంగా ఈ జాతర కొరకు పని చేస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేట్ వాహనాలకు కూడా అనుమతులిచ్చింది. జాతర ప్రాంగణంలో 100కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 8 డ్రోన్ కెమెరాలను, ఎల్.ఈ.డీ స్క్రీన్లను అందుబాటులో ఉంచారు. పిల్లలు తప్పిపోయినా వెంటనే గుర్తించే విధంగా ఏర్పాట్లు చేశారు. కనీవినీ ఎరుగని స్థాయిలో జాతరకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. జాతర ఏర్పాట్లను స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తున్నారు.                                           

మరింత సమాచారం తెలుసుకోండి: