ఇంకా జాతర కూడా మొదలవలేదు అప్పుడే  లక్షల మంది జాతరకు ముస్తాబు అవుతున్నారు. ఇప్పటికే కొందరు భక్తులు అమ్మవార్లను దర్శించుకుని వచ్చారు.. ఇకపోతే తెలంగాణాలో అతిపెద్ద జాతరగా చెప్పబడే సమ్మక్క సారలమ్మ జాతరకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. సంవత్సరం పొడవునా భక్తులు మేడారం వెళ్లి వచ్చేలా ఇప్పుడు అక్కడ సౌకర్యాలు కలిగాయి.  ఓకప్పుడైతే పూర్తిగా అడవితో నిండుకున్న ఈ జాతరను భక్తులు ఒక్కరుగా వెళ్లాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన ఈ జాతరను దర్శించాలనుకున్నదే ఆలస్యం ఎవరికి వారు వెళ్లి వస్తున్నారు.

 

 

ఇదిలా ఉండగా ఈ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రానుండటంతో వారి ప్రయాణాలకు ఇబ్బంది కలుగకుండా తెలంగాణ ప్రభుత్వం రవాణా సౌకర్యాలను కల్పించింది. ఇందులో భాగంగా రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు 500 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్, దిల్‌‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్, జగద్గిరిగుట్ట, నేరేడ్‌మెట్, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, లాల్ దర్వాజ ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరి, ఉప్పల్‌లోని వరంగల్ పాయింట్ మీదుగా ఈ జాతరకు వెళ్లుతాయి.

 

 

ఇకపోతే గుడిమెలిగే పండుగతో మేడారం మహాజాతర ప్రారంభమైనట్లు భావిస్తారు. అంకురార్పణం జరిగిన రోజు నుంచి నాలుగు బుధవారాల పాటు మేడారం జాతర కొనసాగుతుంది. రెండో బుధవారం జనవరి 29న మండ మెలిగెను నిర్వహిస్తారు. మూడో బుధవారం ఫిబ్రవరి 5న అమ్మవార్ల మహాజాతర ప్రారంభమవుతుంది. ఇక చిలుకల గుట్టపైనున్న సమ్మక్కను ఫిబ్రవరి 6న సాయంత్రం గద్దెపై ప్రతిష్ఠాపన చేస్తారు. ఫిబ్రవరి 7న సమ్మక్క–సారలమ్మలతో పాటు పగిడిద్ద రాజులు, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఫిబ్రవరి 8న అమ్మవార్ల తిరుగు ప్రయాణంగా వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.

 

 

ఆ తర్వాత బుధవారం అంటే ఫిబ్రవరి 12న తిరుగువారం నిర్వహిస్తారు. ఇలా ఒక పద్దతిలో జరిగే ఈ జాతరకు గత కొద్ది సంవత్సరాలనుండి భక్తుల తాకిడి ఊహించని విధంగా పెరిగిపోతుంది. మొట్టమొదట గిరజనుల పండగగా చెప్పబడే ఈ జాతర ఇప్పుడు ప్రతి వారు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకోవడం విశేషం.. అంతే కాకుండా రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలిరావడం చూస్తేనే అర్ధం అవుతుంది ఈ జాతరకు ఉన్న ప్రాచూర్యం..

మరింత సమాచారం తెలుసుకోండి: