తలచినదే జరిగినదా... దైవం ఎందులకు..? అంటూ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరిగ్గా బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. అమరావతి విషయంలో ఎప్పటికైనా తాను ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే తెలిసినా ఆ విషయంలో వెనక్కి తగ్గేందుకు బాబు ఇష్టపడలేదు. ఇక జగన్ మూడు రాజధానుల నిర్ణయం తరువాత అమరావతి ఎక్కడ రాజధానిగా కాకుండా పోతుందో అన్న ఆందోళనతో ఆ పరిసర ప్రాంతాల్లో భూములు కొన్న తమ పార్టీ నాయకుల పరిస్థితి ఏంటో అర్థం కాక, ఎట్టి పరిస్థితుల్లో అయినా జగన్ నిర్ణయానికి అడ్డుగోడగా నిలవాలని చూశారు. ఇప్పుడు కేంద్రం ఈ విషయంలో జగన్ కే మా మద్దతు అనే క్లారిటీ ఇచ్చేయడంతో బాబుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. 


ఈరోజు పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీల ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చంద్రబాబు వారికి తగిన సూచనలు చేశారు. అయితే 22 మంది ఎంపీలు ఉన్న వైసిపి ముందు టిడిపి ఆటలు సాగలేదు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ పార్టీని ఇబ్బంది పెట్టడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వ్యవహారశైలిపై పార్లమెంట్ సాక్షిగా విమర్శలు చేశారు. అమరావతి రాజధాని అనేది  ఒక పెద్ద స్కామ్ అని సభలో ప్రకటించారు. అమరావతిలో ఒక చదరపు అడుగు నిర్మాణానికి 11 వేల రూపాయలు ఖర్చు పెట్టారని, ఇది దేశంలో ఎక్కడైనా ఉందా అంటూ పార్లమెంట్ లో మిథున్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా టిడిపి సభ్యులు షాక్ అయ్యారు. 


తెల్ల రేషన్ కార్డుదారుల పేరుతో కోట్ల రూపాయల విలువ చేసే భూములు కొన్నారు అంటే ఆ స్కాం ఎలా జరిగిందో గమనించాలని ఆయన చెప్పగానే టిడిపి ఎంపీలు ఆందోళన చెందారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరిట చంద్రబాబు తన వర్గీయులు అందరికీ ముందుగానే సమాచారం అందించి, పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయించారని, ఇలా నాలుగు వేల ఎకరాలు టిడిపి కి చెందిన వారు కొనుగోలు చేసినట్టు సిఐడి లెక్కలు తేల్చిందని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 


అదేవిధంగా పోలవరం విషయంలో టిడిపి అంతులేని అవినీతికి పాల్పడిందని, అంచనాలకు మించి డబ్బు ఖర్చుపెట్టి టిడిపి పెద్ద స్కాం చేసిందని, పోలవరం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక ఏటీఎం లా పని చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ కి వెళ్లడం ద్వారా ఒక్క ప్రాజెక్టులోనే 800 కోట్లు ఆదా చేసినట్టు  వివరించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టుల్లోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వివరించారు. ఆ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని పార్లమెంట్లో మిథున్ రెడ్డి చెప్పగానే సభ్యులంతా ఆసక్తిగా విన్నారు. వైసిపి పరువు తీద్దామని టీడీపీ సభ్యులు భావిస్తే తెలుగుదేశం పార్టీని నిండు సభలో నవ్వులపాలు చేయడంతో టీడీపీ మరింత కంగారుపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: