ఢిల్లీ పీఠం కోసం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సవాళ్ల పర్వం జరుగుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్న పార్టీలు.. ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. బీజేపీ సీఎం ఫేస్ ఎవరో చెప్పాలని కేజ్రీవాల్ సవాల్ చేస్తే.. ఢిల్లీ సీఎంతో చర్చకు సాధారణ కార్యకర్త చాలని కాషాయ పార్టీ కౌంటరిచ్చింది. 

 

ఢిల్లీ ప్రజలందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సురక్షిత మంచినీరు, 24 గంటల విద్యుత్ అందిస్తామని ఆప్ మ్యానిఫెస్టో ప్రకటించింది. ఇంటింటికీ రేషన్‌ సరుకుల సరఫరా, పది లక్షల మంది సీనియర్‌ సిటిజన్లకు ఉచిత యాత్రాసౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. 

 

ఆప్‌ ప్రభుత్వం 2015లో ఆమోదించిన ఢిల్లీ జన్‌ లోక్‌పాల్‌ బిల్లు నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పింది.  పాఠశాల విద్యలో ప్రవేశపెట్టిన హ్యాపినెస్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కరిక్యులమ్‌ విజయవంతమయ్యాయని, త్వరలో   దేశభక్తికి సంబంధించిన సిలబస్‌ను ప్రవేశపెడతామని పేర్కొంది. ప్రపంచ శ్రేణి రహదారుల నిర్మాణం, యమునా నదీతీరంలో అభివృద్ధి పనులు, ఢిల్లీ మెట్రో విస్తరణ, యువతకు స్పోకెన్‌ ఇంగ్లీష్‌లో శిక్షణ, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ చర్యలు వంటి పలు హామీలను ఆప్ మ్యానిఫెస్టోలో పెట్టింది.

 

బీజేపీకి దమ్ముంటే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని కేజ్రీవాల్ సవాల్ చేశారు. బీజేపీకి ఇందుకోసం బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు టైమిస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకోవాలని, అమిత్ షా ఎంపిక చేయకూడదని చురకలు అంటించారు. 

 

కేజ్రీవాల్ సవాళ్లకు బీజేపీ కౌంటరిచ్చింది. ఆప్ మ్యానిఫెస్టో.. గత మ్యానిఫెస్టోకు నకలుగా ఉందని సెటైర్లేసింది. కేజ్రీవాల్ తో చర్చకు నేతను ఎంపిక చేయాల్సిన పనిలేదని, సాధారణ బీజేపీ కార్యకర్త కూడా అందుకు సిద్ధమేనని బదులిచ్చింది బీజేపీ. రెండు భాగాలుగా రూపొందిన మేనిఫెస్టోలో మొదటి భాగం పది హామీలతో ఇప్పటికే విడుదల కాగా.. రానున్న ఐదేళ్లలో ఏం చేస్తామనేది రెండవ భాగంలో ఆప్‌ పొందుపరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: