తెలంగాణలో కేసీఆర్ వేస్తోన్న వీపు దెబ్బ‌ల‌కు గులాబీ నేత‌ల‌కు బాగానే వాత‌లు తేలుతున్నాయి. కేసీఆర్ సీఎం అయ్యాక తొలి ఐదేళ్ల‌లో క‌మ‌లం వాళ్లు ఎన్నో ఆట‌లు ఆడారు. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కేసీఆర్ కొట్టిన దెబ్బ‌తో ఏదో గోషామ‌హాల్లో రాజాసింగ్ ఆ హిందూత్వ నినాదంతో, త‌న క్రేజ్‌తో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టి ప‌రువు నిలిపాడే కాని.. మ‌హా మ‌హా కిష‌న్‌రెడ్డిలు, ల‌క్ష్మ‌ణ్‌లు, ప్ర‌భాక‌ర్‌లు, చింత‌ల రామ‌చంద్రారెడ్డి లాంటి వాళ్లు అడ్రెస్ లేకుండా పోయారు. ఏదో గాలి వాటంలో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేసీఆర్ చేసిన త‌ప్పులు.. రాంగ్ స్టెప్పుల‌తో అనూహ్యంగా నాలుగు ఎంపీలు బీజేపీ ఖాతాలో చేరాయ్‌.

 

ఠాఠ్ ఇంకేముంది.. కేసీఆర్ అయిపోయాడు... టీఆర్ఎస్ ప‌ని ప‌ట్టేశాం అని బీరాలు పోయారు. మ‌ళ్లీ పంచాయ‌తీలు, మండ‌లాలు, జ‌డ్పీటీసీలు... ఇటీవ‌ల కార్పొరేష‌న్లు, మున్సిపాల్టీల్లో కారు టైరుతో అటు తొక్కించి.. ఇటు తొక్కించి క‌మ‌లాన్ని ఎర్రి పుష్పాన్ని చేసి ప‌డేశారు. ఇక ఇప్పుడు కమ‌లానికి తెలంగాణ‌లో కారు మైకం క‌మ్మేసింది. కారు మ‌బ్బులో భ‌విష్య‌త్ పొద్దు క‌న‌ప‌డ‌డం లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిని మార్చ‌డం ఖాయ‌మైంది.

 

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో... బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప‌ద‌వి కోసం తాజా అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్‌తో పాటు కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన మాజీ మంత్రి డీకే.అరుణ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు ఈ ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్యే ఈ ప‌ద‌వి కోసం పోరు న‌డుస్తోంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రో నేత కూడా వ‌చ్చి చేర‌డంతో టీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం మూడు ముక్క‌లాట మొద‌లైంది.

 

మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొత్తగా ఈ పదవి కోసం పోటీ పడుతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన కూడా ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారని సమాచారం. ఆయ‌న గ‌త ట‌ర్మ్‌లో టీఆర్ఎస్ ఎంపీగాను, ఆ పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా ఉన్నారు. కేసీఆర్ టిక్కెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో వెంట‌నే బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇటీవ‌లే ఆయ‌న ఢిల్లీలో ఈ ప‌ద‌వి కోసం లాబీయింగ్ గ‌ట్టిగా చేస్తున్న‌ట్టు భోగ‌ట్టా..!

 

ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ బీజేపీ ప‌గ్గాలు హైద‌రాబాద్ వాళ్ల‌కే ఇచ్చార‌ని.. ఇక‌పై అయినా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ లాంటి పార్టీ పుంజుకునే జిల్లాకు చెందిన త‌న‌కు ఇస్తే ఉత్త‌ర తెలంగాణ‌లో పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని ఆయ‌న వాద‌న‌ట‌. మ‌రి బీజేపీ పెద్ద‌లు పాత కాపుల‌కే ఈ ప‌ద‌వి ఇస్తారా ?  పార్టీ మారి వ‌చ్చిన అరుణ‌, జితేంద‌ర్‌కు క‌ట్ట‌బెడ‌తారా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: