ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం  రాజకీయ మంటలు రేపుతుండగా , ఈ మంటల్లో చలి కాచుకోవాలని కేంద్రం లోని బీజేపీ నాయకత్వం చూస్తోందా ? అంటే రాజకీయ వర్గాల నుంచి   అవుననే సమాధానం విన్పిస్తోంది .  ఒకవైపు రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్ర పరిధిలోని  విషయమని కేంద్రం  చెబుతూనే , మరొకవైపు 2015 లోనే  అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడం జరిగిందని సెలవిచ్చిందని అంటున్నారు . మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ లోక్ సభ లో టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పింది .

 

అయితే కేంద్రం సమాధానం అటు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు టీడీపీ కి ఊరటనిచ్చేదిగా ఉండడమే ఆశ్చర్యాన్ని కలిగించే అంశం . పరిపాలన వికేంద్రీకరణే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తున్న విషయం తెల్సిందే . అయితే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి వంటి వారు పేర్కొన్నారు . అయితే  కేంద్రం మాత్రం ...  రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశం అంటూ తేల్చి చెప్పి సొంత పార్టీ నేతలకే ఝలక్ ఇచ్చింది  .

 

కేంద్రం ప్రకటన చూసి సంబరపడుతున్న   వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు   , అదే ప్రకటన లోని  మెలికను  చూసి  ఖిన్నులవుతున్నారు . 2015 లోనే అమరావతిని రాజధానిగా నోటిఫై చేసినట్లు కేంద్రం  పేర్కొనడం అటు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలనే కాదు ... ఇటు టీడీపీ నేతలను ఆశ్చర్యానికి గురి చేసి ఉంటుంది . ఎందుకంటే ఇన్నాళ్లు రాజధానిని ఎందుకు నోటిఫై చేయలేదన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక  టీడీపీ నేతలు నీళ్లు నమిలేవారు . ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఆయుధం తో వారు రెచ్చిపోయే అవకాశముంది .  

మరింత సమాచారం తెలుసుకోండి: