అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ 49  రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న అమరావతి పరిసర ప్రాంత రైతులు ఈరోజు ఏపీ సీఎం జగన్ కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. రైతులు చెప్పిన సమస్యలను ఓపిగ్గా విన్నజగన్ మీ సమస్యలన్నిటినీ..  తాను తీరుస్తానని, భవిష్యత్తులోనూ ఎవరికీ, ఎటువంటి కష్టం రాకుండా ఆదుకుంటానని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో జగన్ ను కలిసిన రాజధాని రైతులు వివిధ సమస్యలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జగన్ రాజధాని గ్రామాల్లో భూ సేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్టుగా రైతులకు తెలియజేశారు. 


అలాగే గతంలో తాడేపల్లి పరిధిలో టిడిపి ప్రభుత్వం తీసుకువచ్చిన యూ 1 జోన్ ను ఎత్తివేస్తున్నట్టు రైతులకు జగన్ హామీ ఇచ్చారు. 29 గ్రామాల్లో దాదాపు 5 వేల ఎకరాల్లో గత టిడిపి ప్రభుత్వం బలవంతపు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు రైతుల సమస్యలపై జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రాంత రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మొన్నటి వరకు అమరావతిని రాజధానిగా చేయాలని టిడిపి ఆధ్వర్యంలో 29 గ్రామాల ప్రజలను కొంతమంది టిడిపి నాయకులు రెచ్చగొట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 


ఈరోజు పార్లమెంట్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు కేంద్రం ఎటువంటి అభ్యంతరం చెప్పడంలేదని, ఏపీలో జగన్ తీసుకునే నిర్ణయాలకు అడ్డు చెప్పమనేలా ... రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంటూ బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక అమరావతిలో ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం ఉండదని, జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారనే విషయం అర్థమైన టిడిపి ఇప్పటికే ఈ విషయంపై యుటర్న్ తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో వైసిపి ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్ గా కనిపిస్తోంది.


మూడు రాజధానుల బిల్లు శాసన సభలో ఆమోదం పొందడం, మండలిలో టీడీపీ అడ్డుకోవడం... దీంతో  ఏకంగా మండలిని రద్దు చేయిస్తూ జగన్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయించారు. రెండు మూడు నెలల్లో  దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు అనే విషయం ఇప్పుడు  తెలియడంతో  అమరావతి పరిసర ప్రాంత రైతులు జగన్ నిర్ణయానికి ఇప్పుడు జై కొడుతున్నట్టుగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: