చంద్రబాబునాయుడు ఏడుపు అంతా దేనికి కోసమో బయటపడిపోయింది.  మూడు రాజధానులకు వ్యతిరేకంగా  తెనాలిలో జేఏసి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ మనసులోని మాటను బయటపెట్టేసుకున్నారు.  పట్టిసీమ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి నీళ్ళు తీసుకొచ్చినా తమ అభ్యర్ధని ఓడగొట్టారంటూ చంద్రబాబు భోరుమన్నారు. తాను చేసిన పాపమేంటి అంటూ జనాలను నిలదీశారు. అభివృద్ధి చేయటమే తన పాపమా అంటూ జనాలను నిందించారు.

 

సరే ఇవన్నీ పాతేడుపులే అనుకుంటే అసలేడుపును బయటపెట్టేశారు. తొందరలో జరగబోయే  మున్సిపల్ ఎన్నికల్లో అయినా తెలుగుదేశంపార్టీకి ఓట్లేసి గెలిపించండని జనాలను వేడుకున్నారు. వైసిపికి ఓట్లేసి ఒకసారి చేసిన తప్పును మరోసారి చేయొద్దంటూ  బతిమలాడుకున్నారు. ఒకసారే కదాని కరెంటు తీగని పట్టుకుంటే ఏమవుతుందో గ్రహించాలంటూ జనాలను బెదిరించారు. ఆయన ప్రసంగమంతా ఇలా వేడుకోవటం, బెదిరించటం, హెచ్చరించటంతోనే అయిపోయింది లేండి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైసిపికి ఓట్లేయటం వల్ల తాము తప్పు చేశామని జనాలు ఎవరూ అనుకోవటం లేదు. చంద్రబాబు పాలనలో విసిగిపోయిన జనాలే వైసిపికి ఓట్లేసి 151 సీట్ల బంపర్ మెజారిటి ఇచ్చారు. ఒకసారి చేసిన తప్పును మరోసారి చేయకూడదన్న జనాల ఆలోచన వల్లే చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. సరే మూడు రాజధానుల ప్రతిపాదన వల్ల రాజధాని గ్రామాల్లోని రైతుల్లో కొందరికి జగన్ అంటే బాగా మంటగా ఉండచ్చు.

 

ఒక్క రాజధాని తరలింపు అంశాన్ని పక్కనపెట్టేస్తే అమ్మఒడి, ఇంటి దగ్గరకే పింఛన్, గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల నియామకం, స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రారంభం, రైతుభరోసా, స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనంలో మెను మార్పు లాంటి అనేక కార్యక్రమాలతో మెజారిటి జనాలకు  దగ్గరయ్యారన్నది వాస్తవం. సరే సంక్షేమ ఫలాలు అందుకున్న వారంతా తిరిగి ప్రభుత్వానికే ఓట్లేస్తారని కూడా గ్యారెంటీ ఏమీలేదు లేండి. అందుకనే తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అయినా పార్టీ పుంజుకుంటుందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే పార్టీకి ఓట్లేయండంటూ జనాలను బతిమలాడుకుంటున్నారు. రాజధాని వివాదాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు అసలేడుపేంటో తెలిసిపోయిందా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: