ఏపీకి ప్రత్యేక హోదా ఈ విషయంలో బిజెపి మాట తప్పినా జగన్ మాత్రం ఆ అంశాన్ని వదిలి పెట్టకూడదనే ఉద్దేశంతో ఉన్నారు. ఏపీ తెలంగాణ విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానంటూ అప్పటి కేంద్ర అధికార పార్టీ కాంగ్రెస్ ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఓటమి చెందడం,కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టడం తో హోదా అంశాన్ని బిజెపి ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఏపీలో అధికార పార్టీ గా ఉన్న టిడిపి సైతం హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడంలో విఫలం అయింది. 


కానీ అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసిపి ఈ విషయంలో రాజీ లేని పోరాటం చేస్తూనే వచ్చింది. కొద్ది రోజుల క్రితం బిజెపి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇది ముగిసిన అధ్యయనం అంటూ పేర్కొంది.దీంతో హోదా విషయాన్ని మరోసారి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి దాన్ని సాధించే వరకు వదిలి పెట్టకూడదనే ఉద్దేశం లో ఏపీ సీఎం జగన్ ఉన్నారు. అంతకు ముందే సమయం వచ్చినప్పుడల్లా హోదా గురించి జగన్ ప్రస్తావిస్తూ కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉన్నారు. తాజాగా 15వ ఆర్థిక సంఘం నివేదిక రూపంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని కేంద్రం గతంలో ఆర్థిక సంఘం సూచనల ప్రకారం నడుచుకుంటామంటూ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదే ఆర్థిక సంఘం ద్వారా హోదా ఇవ్వాలంటూ జగన్ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువస్తున్నారు. రాష్ట్రాలకు హోదా కల్పించే సందర్భాల్లో కేంద్రానిదే అంతిమ  నిర్ణయం అని ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన విషయాన్ని జగన్ తన తాజా లేఖలో ప్రస్తావించారు. 14వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాలకు, 15వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాలకు మధ్య బేధాలు చాలా ఉన్నాయని జగన్ కేంద్రానికి గుర్తు చేస్తున్నారు. 


ఏపీ ప్రజల కలలను కేంద్రం పెద్దమనసుతో అర్ధం చేసుకుని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధానికి జగన్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికీ వైసిపి ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో వెనక్కి తగ్గలేదని, ఈ విషయంపై రాజీలేని పోరాటం చేసేందుకు ఎప్పుడూ ముందు ఉంటుంది అనే విషయాన్ని జగన్ స్పష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: