ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు వాయిస్ పెంచాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి చాలా ఆశలు పెట్టుకుంది. రాహుల్, ప్రియాంక ప్రచార బరిలోకి దిగారు. ఆర్ధిక వ్యవస్థను సరిచేయడం చేతగాని మోడీ భవిష్యత్తులో తాజ్ మహాల్‌ను కూడా అమ్మేస్తారంటూ రాహుల్ ధ్వజమెత్తారు.

 

ఢిల్లీలో ఎక్కడ చూసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరే... పోలింగ్ సమయం దగ్గర పడటంతో హేమాహేమీలంతా రంగంలోకి దిగి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి మంత్రాన్ని నమ్ముకున్న కేజ్రీవాల్ ఓవైపు రోడ్ షోలతో ఢిల్లీని చూట్టేస్తుంటే...ఆప్‌ను టార్గెట్ గా చేసుకుని మోడీ ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు రాహుల్ గాంధీ కూడా ఎన్నికల వేడి పుట్టించారు. ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ఢిల్లీకి అవసరమా అంటూ మోడీ విమర్శలు గుప్పించారు. శత్రువులు దాడి చేసేందుకు అవకాశమిచ్చే ప్రభుత్వానికి ప్రజలంతా చరమగీతం పాడాలని షహీన్‌బాగ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో పిలుపునిచ్చారు. 

 

ఒపీనియన్ పోల్ సర్వేలన్నీ మళ్లీ ఆప్ దే అధికారమని ప్రకటించడంతో ఆమ్ ఆద్మీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ది ఎవరో ప్రకటించగలరా అంటూ కేజ్రీవాల్ బీజేపీకి సవాల్ విసిరారు. అటు కాంగ్రెస్ మాత్రం బీజేపీ, మోడీని టార్గెట్‌ చేసుకుని ప్రచారం నిర్వహిస్తోంది. మేక్ ఇన్ ఇండియా అంటూ నినాదాలు చేసే మోడీ...దేశంలో ఒక్క ఫ్యాక్టరీని కూడా నెలకొల్పలేకపోయారంటూ రాహుల్ విమర్శించారు. ఎల్ ఐసీలో వాటాల విక్రయంపై సెటైర్లు వేశారు. ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడం చేతగాక తాజ్ మహల్ ను కూడా అమ్మేస్తారంటూ విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు శనివారం పోలింగ్ ఉండటంతో గురువారం సాయంత్రానికే ప్రచారం ముగియనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: