తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు వయసుకు మించిన భారం ఇప్పుడు మోస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండడం, అధికార పార్టీ దూకుడుగా ఉండడంతో ఎక్కడలేని టెన్షన్ లు చంద్రబాబు మెడకు చుట్టుకుంటున్నాయి. ఇటువంటి కీలక సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తాను ముందుండి పార్టీ క్యాడర్ ను, నాయకులను నడిపిస్తున్నా మిగతావారు పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఉంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సీనియర్ నాయకుడు కళావెంకట్రావు ఉన్నా ఆయన ప్రభావం ఏ మాత్రం లేదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. 


ముందు ముందు కూడా ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి ఉండడం దానికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు కీలకం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తాను ఉన్నా,   లేకపోయినా పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకుడు అవసరం అనే భావనకు వచ్చిన చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వీర విధేయులుగా ఉన్న కింజారపు ఫ్యామిలీ నుంచి గతంలో ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా, ఎంపీగా అనేక పదవులు చేపట్టారు. తరువాత ఆయన వారసుడిగా అచ్చెన్నాయుడు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు.


 గత ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా చేపట్టారు. ఇదే ఫ్యామిలీకి చెందిన ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. అసెంబ్లీలోనూ బయట వైసిపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పార్టీకి అండదండగా ఉంటూ వస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమిస్తే పార్టీ బాగా పుంజుకుంటుందని, ఆయన సారథ్యంలో పార్టీ భవిష్యత్తు బాగుంటుందని అభిప్రాయానికి వచ్చిన చంద్రబాబు ఆయనను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా పార్టీలో ఉన్న ఇతర నేతలను కూడా మార్చి యాక్టివ్ గా ఉన్న నాయకులను నియమించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా  తెలుస్తోంది. దీనిపై తొందర్లోనే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: