ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి మూడు రాజధానులు ఉండవచ్చని ప్రకటన చేసి జనవరిలో జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల దిశగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఏపీ సీఎం జగన్ కు వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ఏపీకి మూడు రాజధానులు వద్దని హెచ్చరించారు. 
 
రాయలసీమవాసులు గతంలో రాజధానిని సమైక్యాంధ్ర కొరకు త్యాగం చేశారని కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేస్తే రాయలసీమ వాసులకు న్యాయం జరుగుతుందని అన్నారు. వైసీపీ పార్టీ తరపున కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న గంగుల బ్రిజేంద్రారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధానిగా కర్నూలును చేయాలని గంగుల బ్రిజేంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోనే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. 
 
కర్నూలును మాత్రమే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ , జ్యుడీషియల్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్ గా చేయాలని అన్నారు. లేని పక్షంలో ఏకంగా ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతానని గంగుల బ్రిజేంద్రా రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాడు. ఇప్పటికే ఒకసారి రాజధానిని పోగొట్టుకొని అన్యాయానికి గురయ్యామని ఇలాంటి సమయంలో కర్నూలుకు న్యాయం జరగాలంటే మాత్రం రాజధాని రావాల్సిందేనని పట్టుబడుతున్నారు. 
 
ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఆళ్లగడ్డలోని మూడు రోడ్ల సెంటర్ లో వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిజేంద్రా రెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. త్వరలో రాజధాని కొరకు కర్నూలులో దీక్షలు చేపడతామని అన్నారు. మరి వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు, సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.                   

మరింత సమాచారం తెలుసుకోండి: