లంచగొండులపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది ఏసీబీ. గతానికి భిన్నంగా లంచాలు తీసుకుంటున్న ఉద్యోగులపై వలేయడానికి తొత్త పద్ధతిలో వెళ్తోంది అవినీతి నిరోధక శాఖ. అవినీతి అనే మాటే వినిపించకూడదన్న ఏపీ సర్కారు ఆదేశాలకు అనుగుణంగా కొరడా ఝుళిపిస్తోంది ఏసీబీ. 

 

అవినీతి అంతం.. సర్కార్‌ పంతం. ఇదీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటన. పైస్థాయిలో అవినీతిని రూపొందించే క్రమంలో వివిధ సంస్కరణలు తెచ్చింది ప్రభుత్వం. దీంట్లో భాగంగా జూడిషియల్‌ ప్రివ్యూ.. రివర్స్‌ టెండరింగ్‌ వంటి విధానాలను అవలంభించడంతోపాటు.. ఔట్‌ సోర్సింగ్‌ వంటి వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసింది జగన్‌ ప్రభుత్వం. రాజకీయ అవినీతిని చాలా వరకు తగ్గించగలిగినా.. అధికారుల స్థాయిలో అవినీతి తగ్గడం లేదనే వాదనలు.. విమర్శలు వినిపించాయి. ప్రత్యేకించి క్షేత్ర స్థాయిలో అవినీతి ఏ మాత్రం కట్టడి కాలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఏసీబీని బలోపేతం చేసే దిశగా జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే గతంలో ఏసీబీ చీఫ్‌గా వ్యవహరించిన కుమార్‌ విశ్వజిత్‌ ప్రభుత్వ అంచనాలకు అందుకోలేకపోయారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోలేకపోయారు. ఏసీబీ పని తీరును సమీక్షించిన జగన్... నిర్మోహమాటంగా విశ్వజిత్ పై వేటు వేశారు.  ఏసీబీ చీఫ్‌ బాధ్యతలను సీనియర్‌ ఐపీఎస్ అధికారి సీతారామంజనేయులకు అప్పగించింది సర్కార్.

 

సీతారామాంజనేయులు  బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏసీబీ కొత్త పంథాలో పని చేస్తున్నట్టే కన్పిస్తోంది. ఏసీబీ తన రోటీన్‌ దాడులకు భిన్నంగా వ్యవహరిస్తూ.. పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్తోంది. గతంలో ఓ అధికారికి సంబంధించిన ఆస్తుల మీద.. వారి బంధువుల ఇళ్లు.. బినామీలు అనుమానం ఉన్న వారి నివాసాలపై ఏక కాలంలో సోదాలు నిర్వహించే వారు. కానీ ఇప్పుడు ఏసీబీ ట్రెండ్‌ మార్చింది. ఇప్పుడూ ఏక కాలంలో దాడులు చేస్తోంది.. అయితే ఏ ఒక్కరి మీదో కాకుండా.. ఓ వ్యవస్థలో అత్యంత అవినీతి పరులుగా పేరొందిన.. ఫిర్యాదులు వచ్చిన వారిని టార్గెట్‌ చేస్తోంది.  దీంతో సదురు విభాగంలో.. ఆ అధికారుల సర్కిల్సులో అవినీతి చేయాలంటేనే భయపెట్టే స్థాయిలో పక్కా ప్రణాళికతో ఏసీబీ దాడులు నిర్వహించి.. లంచావతారుల గుండెల్లో గుబులు రేపుతుందనడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల మీద.. రిజిస్ట్రార్‌ ఆఫీసుల మీద ఏక కాలంలో దాడులు చేయడం ద్వారా ఆ శాఖలు.. ఆయా వర్గాల్లోని లంచగొండులను భయకంపితులను చేస్తోందనే చెప్పాలి. తాజాగా వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న వారి పైనా ఏక కాలంలో 25 బృందాలతో దాడులు చేయడం ద్వారా అన్ని స్థాయిల్లోనూ అధికారుల్లో అవినీతి పేరెత్తితే హడలిపోయేలా వ్యూహ రచనతో ఏసీబీని పరుగులు పెట్టిస్తున్నారు ఏసీబీ చీఫ్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు. అంతేకాదు... దాడులు చేసిన ఉద్యోగుల పూర్తి వివరాలు, వారి దగ్గర దొరికిన ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలను మీడియాకు రిలీజ్ చేస్తున్నారు.

 

ఏయే శాఖలు.. ఏయే విభాగాలు ప్రజలతో నిత్యం టచ్‌లో ఉంటూ.. లంచాలకు.. అవినీతి చేసే ఆస్కారం ఉంటుందో ఎంచుకుని.. వాటిని టార్గెట్‌గా చేసుకుని ఏసీబీ వ్యూహం రచించుకుంటోంది. దీంతో ప్రజల్లో ప్రభుత్వం పైనా.. ఏసీబీ పైనా నమ్మకం కలిగేలా చేసుకోవడంతోపాటు.. లంచాలు తినమరిగిన అధికారులు ఠారెత్తేలా చేయాలనేది ఏసీబీ చీఫ్‌ ఆలోచనా విధానంగా కన్పిస్తోంది. మూకుమ్మడి దాడులు సహజమే కానీ.. ఓ శాఖను టార్గెట్‌ చేసుకుని.. అందులోని అవినీతి అధికారులను టార్గెట్‌ చేసుకునేలా మూకుమ్మడి దాడులు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని చర్చ జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: