ఆదివాసీ పద్ధతిలో సమ్మక్క పెళ్లి....  వనదేవత సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం బుధవారం ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరిగింది. రెండేళ్లకోసారి ఈ తంతును సాగిస్తున్నారు. పగిడిద్దరాజు పూజారులు పసుపు–కుంకుమ, చీర సారెను, సమ్మక్క పూజారులు దోవతి, కండువాలను అందించారు. ఈ తతంగానికి మేడారం గ్రామం వేదికగా నిలిచింది. ఆదివాసీల విశ్వాసం ప్రకారం.. సమ్మక్క భర్త పగిడిద్దరాజు కాగా.. వారి సంతానం సారలమ్మ, జంపన్న. పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. ఆదివాసీల ఇలవేల్పులైన వీరు నాలుగు విభిన్న ప్రాంతాల్లో కొలువై ఉన్నారు. ప్రతీ రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు అయిన బుధవారం సమ్మక్క – పగిడిద్దరాజుకు వివాహం జరిపిస్తారు.  

 

మాఘశుద్ధ పౌర్ణమికి ముందు లేదా తర్వాత వచ్చే బుధవారం రోజున వివాహం జరిపించడం ఆనవాయితీ. పెళ్లి తంతులో భాగంగా ప్రస్తుత మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఉన్న పగిడిద్దరాజు ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో పడిగెను పగిడిద్దరాజుగా భావిస్తూ పెళ్లికొడుకుగా ముస్తాబు చేశారు. నలుగు పెట్టి, పసుపు కుంకుమలతో అలంకరించారు.  ప్రధాన పూజారులుగా పెనక వంశీయులు పెనక బుచ్చిరాములు, పెనక మురళీధర్‌ ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సమ్మక్క పూజారులు గుడికి చేరుకొని పగడిద్దరాజుతో వివాహ పూజలు చేశారు. అనంతరం సమ్మక్క గుడిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వడేరాల కుండల రూపంలో సమ్మక్క – పగిడిద్దరాజుకు కల్యాణం జరిపించారు. అనంతరం గోవిందరాజు, సారలమ్మతో కలసి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరారు.

 

ఆదివాసీలకు కాకతీయ రాజులకు మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంగా సాగే ఈ స్థల పురాణాల నడుమ తేడాలున్నాయి. కొన్ని కథల్లో సమ్మక్క మరణించినట్టు ఉంటే, మరికొన్ని కథల్లో నెత్తురోడుతూ చిలుకల గుట్టవైపు వెళ్లిపోయిందని ఉంది. ఇటీవల ప్రచారంలోకి వచ్చిన మరోకథలో సమ్మక్క సహగమనం చేసినట్లు ఉంది. కొన్ని కథల్లో ఆదివాసీలకు, కాకతీయ ప్రభువులకు మధ్య ఘర్షణ జరిగి, కప్పం చెల్లించలేకపోవడం కారణంగా ఉంటే, మరికొన్ని కథల్లో సహజ వనరుల పంపకాల విషయంలో వివాదం వచ్చినట్లు ఉంది. ఆదివాసీల నుంచి కాకతీయ రాజులు కప్పం వసూలు చేసిన దాఖలాలు లేవని చరిత్రకారులు చెప్పినప్పటికీ ఎక్కువ కథలు మాత్రం కప్పమే యుద్ధానికి కారణమైందని చెప్తున్నాయి. ఈ స్థల పురాణాల్లో ఎక్కువ మంది నోళ్లలో నానే కథ ప్రకారం చారిత్రక విశేషాలు ఇలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: