వైసీపీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న‌కు మ‌ధ్య స్ప‌ష్ట‌మైన తేడా ఉంద‌ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్ప‌ష్టం చేశారు. అభివృద్ధి విధానాల‌తో ఏపీ సీఎం జ‌గ‌న్ ముందుకు వెళుతుంటే... మీడియా ప్ర‌చారంతో విమ‌ర్శ‌లు గుప్పించేందుకు చంద్ర‌బాబు ప‌రిమితం అయ్యార‌ని ఆరోపించారు. సొంత గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేని వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు. 

 

ప్రజల కోరిక మేరకే సీఎం జగన్‌ పరిపాలిస్తున్నారని, అధికార వికేంద్రీకరణ చేస్తే చంద్రబాబు అడ్డుపడ్డారని క‌న్న‌బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబుకు త‌న సొంత ఊరు నారివారి పల్లెపై లేని ప్రేమ అమరావతిపై ఎందుకు పుట్టిందని సూటిగా ప్రశ్నించారు. మంత్రులు నారావారిపల్లె కాదు.. ఏ ప్రాంతానికి అయినా వెళతారు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ‘చంద్రబాబు విజన్‌ విశాఖలో బికినీ ప్రదర్శన చేయాలని... వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్‌ విజన్‌’ అని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల విష‌యంలో అయినా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రాజ‌కీయాల‌ను మానుకోవాల‌ని మంత్రి క‌న్న‌బాబు హిత‌వు ప‌లికారు. ప్రచార సాధనాలను పెట్టుకుని ఒక అబద్ధాన్ని నిజం చేసేలా ప్రయత్నం మానివేయాల‌ని టీడీపీ అధ్య‌క్షుడికి మంత్రి సూచించారు.

 

 

రాజధానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత చంద్రబాబు భంగపడ్డారని అందుకే విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని  మంత్రి కన్నబాబు అన్నారు. రాజధాని విషయంలో ఒక కృత్రిమ పోరాటాన్ని తయారు చేశారని కన్నబాబు మండిపడ్డారు. మొన్నటివరకూ అక్కడ వీధుల్లో తిరిగి జోలె పట్టుకుని చంద్రబాబు చందాలు వసూలు చేశారని, ఆయన క్యారెక్టర్‌కు ఇది ఒక నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత అధికార, పాలనా వికేంద్రీకరణ అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్న మంత్రి ప్రజల అభీష్టం, ఆకాంక్షలు మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని స్ప‌ష్టం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: