ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చైనాలో పుట్టి ఇప్పటికీ సుమారు ఇరవై మూడు దేశాలకి పాకింది. చైనాలోని వుహాన్ నగరంలో ఈ కరోనా బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నగరానికి ప్రస్తుతం రాకపోకలు పూర్తిగా మానేశారు. ఇప్పటికే సుమారు ఐదు వందల మంది వరకు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాధి బారిన పడ్డ వారికోసం చైనా కేవలం తొమ్మిది రోజుల్లోనే వెయ్యి పడకలు గల ఆస్పత్రిని నిర్మించి రికార్డు సృష్టించింది.

 

 

ఈ వైరస్ కి వ్యాక్సిన్ ని కనుగొనేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. తన లక్షణాలని మార్చుకునే ఈ వైరస్ ని అంతమొందించేందుకు వైద్యులు, శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు.   అయితే ఈ కరోనా వైరస్ ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. చైనా వస్తువులకి ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానికి వస్తువులు ఎక్కువ భాగం చైనా నుండే వివిధ దేశాలకి ఎగుమతి అవుతుంటాయి.

 

 


అయితే ఇప్పుడు ఆ ఎగుమతులన్ని ఆగిపోయాయి. ప్రపంచ దేశాలు చైనా నుండి దిగుమతులని ఆపేయడం వల్ల ఎక్కడి స్టాక్ అక్కడే ఉండిపోయింది. దీనివల్ల తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీనితో ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో చైనా భారీగా నష్టాలు చూస్తుంది. తమ ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోవడంతో చైనా ప్రధాన ఆర్ధిక వనరు అనేది ఆగిపోయింది. అంతర్జాతీయంగా అతి పెద్ద ఆర్ధిక శక్తిగా ఉన్న చైనా ఇప్పుడు కోలుకోలేని విధంగా కుదేలు అయిపోతుంది.

 

 


ఇది కేవలం ఒక్క చైనా ఆర్థిక వ్యవస్థనే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. మన తెలుగు రాష్ట్రాల మీద కరోనా ప్రభావం పడిందంటే ఎవరూ నమ్మరు. గుంటూరు మిర్చిలో బాగా పేరొందిన తేజా అనే ఘాటు మిర్చికి చైనాలో డిమాండ్ ఎక్కువ. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చైనా ఆ మిర్చి దిగుమతిని ఆపేసింది. దాంతో గుంటూరులో తేజా మిర్చి ధర బాగా పడిపోయింది. 

 

 

 

ఇక ముందు ముందు చాలా అంశాలపై దీని ప్రభావం ఉండనుంది. ప్రపంచీకరణలో భాగంగా ఎక్కడ ఏం జరిగినా దాని ప్రభావం ఏదో ఒక రూపంలో ప్రపంచం అంతటా ఉంటుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: