వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి సంచలన రీతిలో చంద్రబాబునాయుడుకు సవాలు విసిరారు.  రాజధాని నిర్మాణం కోసం రైతుల నుండి భూములు తీసుకున్న 29 గ్రామాల్లో  మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు నిరూపిస్తే వెంటనే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ సవాలు విసిరటం సంచలనంగా మారింది. వేలాది ఎకరాలను రాజధాని నిర్మాణం పేరుతో తీసుకున్న చంద్రబాబు తన గురించి ఆరోపణలు చేయటం అత్యంత హేయమంటూ మండిపోయారు.

 

రెండు రోజుల క్రితం రాజధాని గ్రామాల్లోని కొందరు రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిసారు. వారిని మంగళగిరి, తాడికొంద ఎంఎల్ఏలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో రైతులతో జగన్ దాదాపు రెండు గంటలపాటు భేటి అయ్యారు. ఆ విషయాన్నే చంద్రబాబు, లోకేష్ మాట్లాడుతూ ఆళ్ళపై ఆరోపణలు చేశారు. జగన్ కలిసింది నిజమైన రైతులు కాదని వాళ్ళంతా ఆళ్ళ బంధులంటూ ఆరోపణలు చేశారు.

 

అదే విషయమై మీడియాతో మాట్లాడిన ఆళ్ళ జగన్ ను కలిసిన రైతుల ఆధార్ కార్డులు, వాళ్ళకు ఎక్కడెక్కడ పొలాలున్నాయి అనే విషయాలను ఆధారాలతో సహా వివరించారు. అదే సమయంలో  చంద్రబాబుకు సవాలు విసిరారు. వేలాది ఎకరాలు తీసుకున్న చంద్రబాబు అమరావతి పరిధిలోని గ్రామాల్లో మైళిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదంటూ మండిపడ్డారు.

 

ఇప్పటికీ రాజధాని గ్రామాల్లో తిరగటానికి సరైన రోడ్లు లేవని, డ్రైనేజి వ్యవస్ధ ఏర్పాటు చేయలేదని, మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదంటూ చంద్రబాబుపై ఆళ్ళ మండిపోయారు. రాజధాని గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించటానికి చంద్రబాబుకు ఐదేళ్ళ కాలం సరిపోలేదా ? అంటూ నిలదీశారు. భూములు తీసుకున్నారు కానీ గ్రామాల్లో  సౌకర్యాలు కల్పించటానికి మాత్రం చంద్రబాబుకు మనసు రాలేదంటూ ఎద్దేవా చేశారు.

 

నిజంగానే గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించుంటే చంద్రబాబు వచ్చి చూపించాలంటూ సవాలు విసిరారు.  మౌళిక సదుపాయాలు కల్పించినట్లు చంద్రబాబు చూపిస్తే తాను వెంటనే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తానంటూ సవాలు విసిరారు. మరి ఆళ్ళ సవాలుకు చంద్రబాబు స్పందిస్తారా ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: