తెలంగాణ కుంభ‌మేళగా పిలువబడే సమ్మక్క - సారక్క జాతర జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి జిల్లాలోని మేడారం  అటవీ ప్రాంతంలో నిన్న ఘనంగా ప్రారంభమైంది.  నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈజాతర కు  తెలుగు రాష్ట్రాల్లో నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 
 
ఇక ఈ జాతర లో ప్రధాన ఘట్టం..  వన దేవతలైన సమ్మక్క -సారక్క లను గద్దెల మీద ప్రతిష్టించడం. అందులో  భాగంగా మొదటగా  కన్నెపల్లి నుంచి గిరిజన పూజారులు సారలమ్మను గద్దెల మీదకు తీసుకువస్తారు. సారలమ్మ అమ్మవారి ప్రతిరూపంగా భావించే పసుపు, కుంకుమ భరిణెలను తీసుకుని వేలాది మంది భక్తులు వెంట రాగా  భుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మేడారానికి బయలుదేరుతారు. అలా మేడారానికి వచ్చే క్రమంలో మూడు కిలోమీటర్ల మేర భక్తులు పెద్దఎత్తున బారులుతీరి  పూజారిని తాకే ప్రయత్నం చేస్తుంటారు ఆ సమయంలో పూజారిని తాకితే సంతాన భాగ్యంలేని వారికి పిల్లలు పూడతారని  భక్తుల విశ్వాసం. సారలమ్మను తీసుకొచ్చే  క్రమంలో జంపన్న వాగు మీదుగా వస్తూ ఆ వాగులో స్నానమాచరించి.. ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం రాత్రి 8 గంటల వరకు సారలమ్మను గద్దెల వద్దకు చేరుస్తారు. 
 

ఇక అప్పటికే  ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు, గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్ధరాజులు గద్దెల వద్దకు చేరుకుంటారు.  ఇక ఈజాతరలో మరో ముఖ్య ఘట్టం  సమ్మక్క ను గద్దెల మీద ప్రతిష్టించడం.. .గద్దెలకు కొద్దిదూరంలో ఉండే చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. గురువారం ఉదయమే గిరిజన పూజారులు గుట్టపైకి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం  రాత్రి 8 గంటల సమయానికి సమ్మక్క గద్దెపైకి చేరుకుంటుంది.  శుక్రవారమంతా గద్దెలపై దేవతలుగా భక్తులకు దర్శనమిస్తారు. శనివారం దేవతలు వనప్రవేశం చేయడంతో ఈ మహా  జాతర ముగుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: