ప్రపంచ దేశాలను వణికిస్తోన్న 'కరోనా' మహమ్మారి.. భారత వాణిజ్యంపైనా పెను ప్రభావం చూపిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా రానున్న రెండు నెలల్లో సూరత్‌ వజ్రాల పరిశ్రమకు దాదాపు 8వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. హాంకాంగ్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించడమే ఇందుకు కారణం.

 

చైనాలో విజృంభించిన కరోనావైరస్‌ హాంకాంగ్‌కు వ్యాపించింది. ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా అక్కడ ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో 18 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో హై అలర్ట్ విధించింది హంకాంగ్. మార్చి మొదటివారం వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేసింది ప్రభుత్వం. మరోవైపు వైరస్‌ ప్రభావంతో హాంకాంగ్‌లో వ్యాపారాలు కూడా నెమ్మదిస్తున్నాయి. ఆ ప్రభావం సూరత్‌ వజ్రాల పరిశ్రమపై తీవ్రంగా పడింది. 

 

సూరత్‌కు హాంకాంగ్‌ ప్రధాన వ్యాపార కేంద్రం. ఏటా ఇక్కడి నుంచి దాదాపు 50వేల కోట్ల విలువైన పాలిష్డ్‌ వజ్రాలు హాంకాంగ్‌కు ఎగుమతవుతాయి. సూరత్‌ నుంచి ఎగుమతయ్యే మొత్తం వజ్రాల విలువలో ఇది 37శాతం. కరోనా వైరస్‌ భయంతో గుజరాత్‌ వజ్ర వ్యాపారులు దేశానికి తిరుగుముఖం పట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే సూరత్‌ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుందంటుంది జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌. ఫిబ్రవరి, మార్చి నెలల్లో దాదాపు 8వేల కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదముందని అంచానా వేస్తుంది. 

 

మరోవైపు.. వచ్చే నెలలో హాంకాంగ్‌లో అంతర్జాతీయ జువెల్లరీ ఎగ్జిబిషన్‌ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా రద్దయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇది కూడా సూరత్‌ వ్యాపారులపై ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు. కరోనా వైరస్.. మనుషుల ఆరోగ్యాలనే కాదు.. వాళ్ల వ్యాపారాలను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా జువెలరీ బిజినెస్ కుంటుపడింది. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. భారత ఆర్థికవ్యవస్థపై కరోనా వేసిన కాటుకు బలైపోతున్నారు. ఈ ప్రభావం ఎన్నాళ్లు ఉంటుందో తెలియకపోవడంతో తలలపట్టుకుంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: