’ఆంబోతులు రెండు కొట్టుకుంటుంటే మధ్యలో నలిగిపోయిన లేగదూడలు’,  ’కరవమంటే కప్పుకు కోపం..విడవమంటే పాముకు కోపం’ ... ఇలా ఎన్ని సామెతలైనా సరిపోతాయి మండలి ఉద్యోగుల పరిస్ధితిని చెప్పటానికి.  అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి బాగానే ఉన్నాయి కానీ మధ్యలో ఉద్యోగులే నలిగిపోతున్నారు. ఛైర్మన్ చేసిన సెలక్ట్ కమిటి ప్రకటనే ఈ కంపు మొత్తానికి ప్రధాన కారణమైంది. ఛైర్మన్ వైఖరిని ప్రభుత్వం తప్పు పట్టటంతో సమస్య ముదిరిపోయింది.

 

లేని అధికారాలను చేతుల్లోకి తీసుకుని సెలక్ట్ కమిటి పరిశీలనకు రెండు బిల్లులను పంపుతున్నట్లు ఛైర్మన్ ప్రకటన చేయటమే పెద్ద తప్పు. ఆ విషయాన్ని అధికారులు చెప్పినా వినకుండా సెలక్ట్ కమిటికి పార్టీల నుండి సభ్యుల పేర్లను తెప్పించమని ఆదేశాలివ్వటమే రెండో తప్పు. తాజాగా రెండు కమిటిల్లో సభ్యులను భర్తీ చేసేసి కమిటిలు వేసినట్లు అధికారికంగా ప్రకటించమని అధికారులపై ఒత్తిడి పెంచుతుండటమే ఛైర్మన్ చేస్తున్న చివరి తప్పు.

 

కమిటిలను  అధికారికంగా ప్రకటించమని ఒకవైపు ఛైర్మన్ ఒత్తిడి, అసలు ఛైర్మన్ ప్రకటనే చెల్లదంటూ శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి వాదన ఇంకోవైపు. ఈ ఇద్దరి మధ్య శాసనమండలిలో పనిచేస్తున్న ఉద్యోగులు బాగా ఇబ్బంది పడిపోతున్నారు. విచిత్రమేమిటంటే నిబంధనలను ఉల్లంఘించాలని మామూలుగా అధికారపార్టీ అనుకుంటుంది. కానీ ఇక్కడ టిడిపి నిబంధనలను తుంగలో తొక్కేస్తుంటే అధికార వైసిపి మాత్రం నిబంధనల ప్రకారమే వెళ్ళాలని అధికారులను కోరుతోంది.

 

నోటిమాటతో ఆదేశాలిస్తున్న ఛైర్మన్ బాగానే ఉన్నాడు. ఛైర్మన్ వైఖరిని ఖండిస్తున్న మంత్రి, అధికారపార్టీ నేతలూ బాగనే ఉన్నారు. మధ్యలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందే బాగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే వీళ్ళ మధ్యలో నలిగిపోవటం ఎందుకని ? అధికారుల్లో ఆలోచన మొదలైంది. దాని పర్యవసానమే సెలవులు పెట్టేస్తే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని సమస్యకు పరిష్కారం కనుక్కునేంత వరకూ విధులకు దూరంగా ఉంటే సరిపోతుందనే చర్చ సిబ్బందిలో మొదలైంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: