శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేయటంతోనే మండలి రద్దయినపోయినట్లేనా ? మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన ప్రకారం మండలి రద్దు అయిపోయినట్లే అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం శాసనమండలిని విభజించాలని అసెంబ్లీలో తీర్మానం చేయలేదట. మండలిపై అసెంబ్లీలో ఎటువంటి తీర్మానం చేయకుండానే  పార్లమెంటులో రాష్ట్ర విభజన జరిగిపోయింది కాబట్టి అసలు మండలి ఉనికిలోనే లేదని తాజాగా ఉండవల్లి చేస్తున్న వాదన సంచలనంగా మారింది.

 

ఆమాటకొస్తే అసలు రాష్ట్ర విభజన కూడా చెల్లదంటూ ఉండవల్లి ఎప్పటి నుండో వాదించటమే కాకుండా సుప్రింకోర్టులో కేసు కూడా వేశారు లేండి.  మీడియాతో ఉండవల్లి చెప్పిన ప్రకారమైతే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ ను విభజించినపుడు కూడా చెన్నై అసెంబ్లీలో శాసనమండలి విభజనపై తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

 

కాబట్టి ఇపుడు ఉండవల్లి చెబుతున్నదాని ప్రకారం మండలి రద్దు చేస్తు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఓ ప్రకటన చేస్తే సరిపోతుందట. రద్దు తీర్మానాన్ని ఆమోదించి ఆ విషయాన్ని ఢిల్లీకి పంపితే సరిపోతుందని ఉండవల్లి స్పష్టంగా చెప్పారు. ఎలాగూ అసెంబ్లీ తీర్మానంపై కేంద్ర హోంశాఖ ఆమోదం కానీ పార్లమెంటు ఆమోదం కానీ అవసరమే లేదు కాబట్టి జగన్ చేసిన ప్రకటనతోనే మండలి రద్దు వెంటనే అమల్లోకి వచ్చేస్తుందని అన్నారు.

 

ఉండవల్లి అంటే ఏదో గాలిమాటలు చెప్పే వ్యక్తి కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఉండవల్లి చెప్పిన లాజిక్ పై  ఇపుడు అధికార పార్టీ నేతల మధ్య బాగా చర్చ జరుగుతోంది. గోటితో పోయే విషయాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నామనే అభిప్రాయం అధికార పార్టీ నేతలమధ్య నలుగుతోంది. అంటే ఇపుడు ఉండవల్లి చెప్పింది కరెక్టనే అభిప్రాయం వ్యక్తమవుతోందనే చర్చ జరుగుతోందంటే జగన్ కు సలహాదారులుగా ఉన్న వాళ్ళు ఫెయిలైనట్లే అని అర్ధమైపోతోంది. కాబట్టి ఇప్పటికైనా ఉండవల్లిని జగన్ సలహదారునిగా పెట్టుకుంటే భవిష్యత్తులో  సమస్యలు లేకుండా ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: