కొండ‌వీడు ఖ్యాతిని ఈ ప్ర‌పంచానికి చాటిచెప్పాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. చిల‌క‌లూరిపేట‌లోని త‌న‌ కార్యాల‌యంలో గురువారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని జిల్లా అట‌వీశాఖ అధికారి ఎన్‌.రామ‌చంద్ర‌రావు స‌మావేశ‌మ‌య్యారు. కొండ‌వీడు చ‌రిత్ర‌ను త‌ర‌త‌రాల‌కు అందించేలా, ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునేలా కొండ‌వీడును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉంద‌ని తెలిపారు.  ఈ నెల నాలుగో తేదీన గుంటూరు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో కొండ‌వీడు అభివృద్ధిపై అన్ని శాఖల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే డీఎఫ్‌వోతో ప్ర‌త్యేకంగా స‌మావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త‌మ ప్ర‌భుత్వం కొండ‌వీడు స‌మ‌గ్ర అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపారు.

కొండ‌వీడులో అభివృద్ధి ప‌నుల‌కు దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి శంకుస్థాప‌న చేశార‌ని, ఆయా ప‌నుల‌ను ఇప్పుడు త‌మ ప్ర‌భుత్వంలో పూర్తిచేయ‌బోతున్నామ‌ని పేర్కొన్నారు. నిధుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని వెల్ల‌డించారు. కొండ‌వీడు స‌మ‌గ్ర అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఖ‌ర్చు చేసేందుకైనా వెనుకాడేది లేద‌ని తెలిపారు. కొండ‌వీడు కొండ‌పై చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల్లో సింహ‌భాగం అట‌వీశాఖే చేప‌ట్టాల్సి ఉంద‌ని చెప్పారు. వ‌చ్చే ప‌ది రోజుల్లోగా డీపీఆర్‌లు సిద్ధం చేయాల‌ని ఎమ్మెల్యే ఆదేశించారు. చేప‌ట్టే ప్ర‌తి ప‌ని అంత‌ర్జాతీయ స్థాయిలో ఉండాల‌ని చెప్పారు. బోయ‌పాలెం నుంచి కొండ‌వీడు వ‌ర‌కు అన్ని సౌక‌ర్యాల‌తో నాలుగు లైన్ల ర‌హ‌దారి నిర్మాణం, తోర‌ణాల ఏర్పాటుకు సంబంధించి ఆర్ అండ్ బీ ఉన్న‌తాధికారుల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు జారీచేసిన‌ట్లు చెప్పారు.

అన్ని శాఖ‌ల నుంచి వ‌చ్చే 10 రోజుల్లో డీపీఆర్ లు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేస్తామ‌న్నారు. ఈ నెల 18వ తేదీన క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో మ‌రో స‌మావేశం నిర్వ‌హించేందుకు అనుమ‌తి తీసుకుంటాన‌ని, అప్ప‌టిక‌ల్లా అన్ని శాఖ‌ల అధికారులు కొండ‌వీడు అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్‌ల‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంద‌ని చెప్పారు. ఆయా డీపీఆర్‌ల‌ను ప్ర‌భుత్వానికి నివేదించి నిధులు మంజూరుచేయించుకునే బాధ్య‌త‌ల‌ను తాను తీసుకుంటాన‌న్నారు.


మార్చినాటికి 40 శాతం ప‌నులు పూర్తిః డీఎఫ్‌వో
మార్చి నెలాఖ‌రు నాటికి కొండ‌వీడు కొండ‌పై ప‌లు అభివృద్ధి ప‌నులు పూర్తిచేస్తామ‌ని డీఎఫ్ వో తెలిపారు. కొండ వ‌ద్ద ప్ర‌వేశ‌తోర‌ణం, చిన్న‌పిల్ల‌ల పార్కు, అడ్వెంచ‌ర్ పార్క్‌, పార్కింగ్ ఏరియా త‌దిత‌రాల‌ను మార్చి నెలాఖ‌రు నాటికి అందుబాటులోకి తీసుకొస్తామ‌ని చెప్పారు. కొండ‌పై ఉన్న చెరువుల్లో బోటింగ్ కూడా వ‌చ్చే నెలాఖ‌రునాటికి ప్రారంభ‌మ‌య్యేలా చూస్తామ‌ని తెల‌పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న‌పిల్ల‌ల పార్కును విశాఖ‌ప‌ట్ట‌ణంలోని కుంభాల‌కొంట స్థాయిలో అభివృద్ధి చేయాల‌ని సూచించారు. వ‌చ్చే 5 ఏళ్ల‌లో కొండ‌వీడు కోసం రూ.100 కోట్ల వ‌ర‌కు ఖర్చు చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: