అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న దేశ రాజ‌ధాని ఢిల్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌చార ప‌ర్వం ముగిసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పూర్త‌యింది. ప్రచారంతో పాటు మద్యం దుకాణాలు కూడా బంద్ కానున్నాయి. ఈ నెల 8న ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.  అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌), విపక్ష బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ కూడా గట్టి పోటీనిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

 

ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు..జనవరి 14న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఫిబ్రవరి 8న పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా... 11న కౌంటింగ్‌ పూర్తి చేసి, అదే రోజు తుది ఫలితాలు వెల్లడించనుంది.  సీఏఏ, ఎన్‌ఆర్‌సీ నేపథ్యంలో జేఎన్‌యూ, షాహిన్‌బాగ్‌లలో నిరసనకారులు ఆందోళనలు నిర్వహిస్తుండడంతో ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అన్ని పార్టీలు, ముఖ్య నేత‌లు భారీగా రోడ్‌షోలు, బ‌హిరంగ స‌భ‌ళు నిర్వహించారురు. ప్రత్యర్థి పార్టీల నేత‌ల‌పై విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగించారు.

 

కాగా, ఈ నెల 8న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీవాసులు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కు మరోసారి అధికారం కట్టబెడతారని టైమ్స్‌నౌ-ఐపీఎస్‌ఓఎస్‌ సర్వే వెల్లడించింది. అయితే ఆ పార్టీకి గతం కన్నా ప్రాబల్యం తగ్గుతుందని, మొత్తం 70 స్థానాల్లో ఈసారి ఆప్‌ 54-60, బీజేపీ 10-14 స్థానాలు గెలిచే అవకాశమున్నట్లు సర్వే తెలిపింది. 2015లో జరిగిన ఎన్నికల్లో 67 స్థానాల్లో ఆప్‌ విజయం సాధించగా బీజేపీ 3 సీట్లను దక్కించుకున్నది. కాంగ్రెస్‌ పరిస్థితి ఈసారి కూడా గతం మాదిరిగానే ఉంటుందని, 0-2 సీట్లు దక్కవచ్చని సర్వే అంచనా వేసింది.  సీఎం కేజ్రీవాల్‌ 52 శాతం ఓట్లను పొందవచ్చని, ఇది గతం కంటే 2.5 శాతం తక్కువని పేర్కొంది. బీజేపీ ఓట్ల వాటా గతంకంటే 1.7 శాతం పెరిగి 34 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: