తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పుట్టెడు కష్టాలను ఎదుర్కొంటోంది. ఒకవైపు పార్టీ ప్రతిపక్షంలో ఉండడం, నాయకులంతా ఒక్కొక్కరుగా చేజారి పోతూఉండటంతో మొన్నటి వరకు ఆందోళనలో ఉంది. ఆ తర్వాత అమరావతి విషయంలో కేంద్రం తాము జోక్యం చేసుకోమని జగన్ నిర్ణయానికి వదిలేస్తున్నామని చెప్పడం ఇలా వరుసగా అన్ని వ్యతిరేకంగానే జరుగుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీకి చెందిన నాయకులు ఒకరి తరువాత ఒకరి మీద అవినీతి ఆరోపణలు సాక్షాలతో సహా బయటపడుతుండడంతో  ఒక్కొక్కరుగా కేసుల్లో ఇరుక్కుంటూనే ఉన్నారు. 


తాజాగా ఈ రోజు బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ బ్యాంకు వాయిదాలు కట్టకుండా ఎగవేయడంపై బ్యాంకు అధికారులు జప్తు  నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగానే చంద్రబాబు మాజీ సిఎస్ టి. శ్రీనివాస్ ఇంటిపై ఐటి సోదాలు జరగడం, కీలక ఆధారాలను సేకరించడం కలకలం రేపింది. అలాగే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు బినామీ పేర్లతో అమరావతి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు సిఐడి అధికారులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఆయన కుమారుడు శరత్ కు చెందిన డీఎన్సీ ఇన్ఫ్రాలో ఐటీ సోదాలు జరిగాయి.


అలాగే  కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి కి చెందిన ఆర్కే ఇన్ఫ్రా లోనూ ఐటీ సోదాలు జరిగాయి. కొద్ది రోజుల క్రితమే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ అక్రమాలు, ఫోర్జరీ సంతకాల వ్యవహారంపైనా అధికారులు కేసులు నమోదు చేశారు. ఇక  గుంటూరు జిల్లాకు చెందిన నవయుగ కన్స్ట్రక్షన్ ఎండీ రాయపాటి సాంబశివరావు మీద కూడా కొద్ది రోజుల క్రితం ఐటీ అధికారులు దాడులు చేయడం, ఆయనకు సంబంధించిన ఆస్తుల పై కీలక ఆధారాలు సంపాదించడం తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాయకులంతా ఇలా ఒక్కొక్కరూ అవినీతి కేసుల్లో సాక్షాధారాలతో సహా ఇరుక్కోవడం  తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.


 వీరే కాకుండా మరికొందరుపై అధికారులు దాడులు నిర్వహించే అవకాశం ఉందనే వార్తలతో తెలుగుదేశం పార్టీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే కొంతమంది పార్టీ మారేందుకు సిద్ధమవుతుండగా మరొకొందరు శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటే బెటర్ అన్న ఆలోచనకు వచ్చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలపై టీడీపీ బెంబేలెత్తిపోతుండడంతో సర్వత్ర ఆందోళన నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: