ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడి మీద తన మాటల దాడి చేసే యువ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ మరోసారి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన మాహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఆయన మైనరిటీ సోదరులకు అన్యాయం జరిగితే మౌనంగా ఉండే ప్రసక్తే లేదన్నారు. 


ప్రతీ చిన్న విషయాన్ని రాద్ధాతం చేసే టీడీపీ, పార్టమెంట్‌లో తమ ఎంపీ మిథున్‌ రెడ్డి ఎన్‌ఆర్సీకి సంబంధించి మాట్లాడినప్పుడు టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదన్నారు. చంద్రబాబు జోలే పట్టుకొని అడ్డుకోవటం మాత్రమే తెలుసుగాని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేంత దమ్ము లేదని ఎద్దేవా చేశారు. బాబు రాష్ట్ర ప్రయోజానాలను పక్కన పెట్టి కేవలం 29 గ్రామాల కోసం, తమ బంధువుల బినామీ ఆస్తుల కోసం పోరాటం చేస్తున్నారని విమర్శించారు.


చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఖండ విజయం సాధించిన వైఎస్సార్సీపీ పార్టీని విమర్శించే అర్హత కూడా టీడీపీ పార్టీకి లేదన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి పదేళ్ల కష్టం, 3 వేల కిలోమీటర్ల పాదయాత్రతో ప్రజల మనసు గెలుచుకొని ఈ సంచలన విజయం సాధించారన్న అనిల్‌, చంద్రబాబు మాత్రం సొంత మామకే వెన్నుపోటు పొడిచి టీడీపీ పార్టీని లాక్కున్నారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీని వదిలి సొంత పార్టీ పెట్టి గెలవాలని సవాల్ విసిరారు.

 

ప్రజలు ఎన్టీఆర్‌ మీద ఉన్న గౌరవం ప్రేమతోనే ఇప్పటికీ టీడీపీకి ఓట్లు వేస్తున్నారే తప్ప చంద్రబాబు ముఖం చూసి కాదన్నారు. టీడీపీ నుంచి కాకపోతే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. సీఎం జగన్‌ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మం అయిపోతాడన్నారు. కానీ జగన్‌లో క్షమా,దయా గుణం ఉండటం వల్లే టీడీపీ ఎన్ని కుట్రలు చేస్తున్నా సహిస్తున్నారన్నాడు అనిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: