మున్సిపల్ ఎన్నికలకు సిద్దమవుతోంది ఏపీ సర్కార్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కోర్టులో స్టే ఉన్నందున ముందుగా పుర ఎన్నికలకే మొగ్గు చూపుతోంది. ఎన్నికల సంఘం కూడా ఆ దిశగా కసరత్తు  ప్రారంభించింది.  సన్నద్ధంగా ఉండాలంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

 

స్థానికం సహా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.  క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన ప్రక్రియను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ఎన్నికలకు సిద్దం అవుతోంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే వార్డుల విభజన.. గ్రామ పంచాయతీల డి-నోటిఫికేషన్.. కొత్త మున్సిపాల్టీల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో వడి వడిగా అడుగులు వేస్తోంది సర్కార్. 

 

ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టుల్లో స్టే ఉండటంతో వాటి కంటే ముందుగానే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది సీఎం జగన్ సర్కార్. ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక రిజర్వేషన్ల విషయంలో స్థానిక సంస్థల ఎన్నికల మాదిరి కాకుండా.. 50 శాతానికి తగ్గట్టుగానే రిజర్వేషన్లు ఉన్నాయి.  సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ముందు మున్సిపల్ ఎన్నికలకు.. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ తన కసరత్తును ముమ్మరం చేసింది. 

 

మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ సిద్దంగా ఉందనే సంకేతాలు వెళ్లడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. ఎన్నికల నిర్వహాణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు.. ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రిపేరేషన్స్ మొదలు పెట్టింది.  13 జిల్లాల కలెక్టర్లు.. ఎస్పీలు.. ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించింది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను సమీక్షించి.. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించింది.   

 
ముఖ్యంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహించే విషయంలో విడి విడిగా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహాణకు సంబంధించిన ప్రక్రియను కుదించిన విషయాన్ని ప్రస్తావించింది ఎన్నికల సంఘం.  నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రస్తుతం ఉన్న కాల వ్యవధి  20 రోజులకే కుదించింది.  ఓవైపు ప్రభుత్వ కసరత్తు.. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం సంసిద్దత చూస్తుంటే.. త్వరలోనే స్థానిక ఎన్నికల నగారా మోగడం ఖాయంగా కన్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: