ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అత్యాచారం, హత్యలకు సంబంధించిన ఘటనలు పెరిగిపోతున్నాయి. కానీ మెజారిటీ కేసుల్లో నిందితులు శిక్షల నుండి తప్పించుకుంటున్నారని ప్రజల నుండి విమర్శలు వ్యక్తమవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో శిక్ష పడినా ఆ శిక్ష అమలు విషయంలో జాప్యం జరుగుతోందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇలాంటి తరుణంలో పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు నేరం రుజువైన పక్షంలో నిందితులను నడిరోడ్డుపై బహిరంగంగా ఉరి తీయాలని పాక్ ప్రభుత్వం తీర్మానించింది. పాక్ పార్లమెంట్ ఈ తీర్మానానికి ఆమోదం తెలిపింది. కొన్ని నెలల క్రితం పాకిస్థాన్ లోని నౌషెరా ప్రాంతంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 8 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన పాక్ అంతటా సంచలనం సృష్టించింది. 
 
రోజురోజుకు చిన్నారులపై అత్యాచారం, హత్యలకు సంబంధించిన ఘటనలు పెరిగిపోతూ ఉండటంతో చిన్నారులపై హత్యాచారం చేస్తే ఉరిశిక్ష పడేలా చేయాలనే ఉద్దేశంతో పాక్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అలీ మహ్మద్ ఖాన్ ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదంలో పార్లమెంట్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.                             
 
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత రాజా అష్రాఫ్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో ఉరి తీయాలనే నిర్ణయం సరైన నిర్ణయం కాదని ఈ బిల్లు ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధంగా ఉందని అన్నారు. దోషులకు విధించే శిక్షలో తీవ్రత పెరిగినంత మాత్రం నేరాల సంఖ్య తగ్గదని పేర్కొన్నారు. మానవ హక్కుల మంత్రిత్వ శాఖ మంత్రి శిరీన్ బజారి మాట్లాడుతూ పార్లమెంట్ లో ఆమోదించిన తీర్మానం పార్టీ నిర్ణయంలా ఉందే తప్ప ప్రభుత్వ నిర్ణయంలా లేదని చెప్పారు. ఈ నిర్ణయాన్ని మానవ హక్కుల మంత్రిత్వ శాఖ ఎట్టి పరిస్థితులలోను అంగీకరించదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: