రాయలసీమ కరవు నివారణే లక్ష్యంగా జగన్ భారీ ప్లాన్ రూపొందించారు. వేల కోట్ల రూపాయలతో సీమకు నీటి కరువు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. దుర్భిక్షానికి చిరునామాగా మారిన రాయలసీమను సుభిక్షంగా మార్చాలని జగన్‌ సంకల్పించారు. కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను నింపడం ద్వారా ఆయా ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు భారీ ప్లాన్ రూపొందించారు.

 

ఏకంగా రూ.33,869 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనులకు పరిపాలనా అనుమతి ఇచ్చి.. టెండర్లు పిలవాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. శ్రీశైలం జలాశయం నుంచి వరద నీటిని ఒడిసిపట్టి.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టులకు తరలించేందుకు కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచే పనులను చేపడతారు.

ఇప్పటికే రాజోలి, జోలదరాశి జలాశయాల నిర్మాణం, చక్రాయిపేట ఎత్తిపోతల, కుందూ ఎత్తిపోతల పథకాలకు సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి సర్కార్‌ అనుమతి ఇచ్చింది. మిగిలిన పనులకు డీపీఆర్‌లు తయారు చేసి.. ఆ పనులు చేపట్టడానికి పరిపాలనా అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.

 

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగుల కంటే తక్కువగా ఉన్నప్పుడు రోజుకు 3 టీఎంసీల చొప్పున బీసీఆర్‌కు తరలించి.. అక్కడి నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు జలాలను సరఫరా చేయడానికి శ్రీశైలం జలవిస్తరణ ప్రాంతం నుంచి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రాయలసీమ ఎత్తిపోతలగా నామకరణం చేసింది. ఈ పథకానికి రూ.3,890 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.

 

 

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి విడుదల చేసే జలాలను పూర్తిస్థాయిలో తరలించేలా నిప్పుల వాగు సామర్థ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటికి రూ.1,501 కోట్లు వ్యయం అవుతుంది. కుందూ వరద నీటిని ఒడిసిపట్టేలా రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్యారేజీ.. జోలదరాశి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు రూ.1,677 కోట్లు వ్యయం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: