అమరావతిలో రాజధాని ప్రకటనకు ముందు పెద్ద ఎత్తున జరిగిన భూములు కొనుగోలు వ్యవహారం ఇప్పుడప్పుడే తేలేలా కనిపించడం లేదు. తవ్విన కొద్దీ దీనికి సంబంధించిన ఆధారాలు బయటపడడంతో కలకలం రేగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు బినామీ పేర్లతో రాజధాని ప్రకటనకు ముందే భారీ ఎత్తున కొనుగోళ్లు చేసినట్టుగా ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కొనుగోళ్లు వ్యవహారం ముగిసిన తరువాత రాజధాని ప్రకటనను అప్పటి టీడీపీ ప్రభుత్వం చేయడం, టిడిపి నాయకులు కొనుగోలు చేసిన భూములను తప్పించి రాజధాని అలైన్మెంట్ చేయడం, ఆ తరువాత దీనిని సీఆర్డీయే కు పంపడం జరిగిపోయాయి. 


దీని ద్వారా టిడిపి నాయకులు బాగా లబ్ధి పొందినట్టుగా ప్రచారం జరిగింది. వాటిపై ఇప్పుడు కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అసలు ఈ భూముల కొనుగోళ్ల వ్యవహారం వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరా అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే సి ఐ డి, ఈ డి రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి కొంతమంది టీడీపీ కీలక నాయకులపై కేసులు కూడా నమోదు చేశారు.  తాజాగా ఈ భూములపై ఐటీ శాఖ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నట్టు తెల్సుతోంది. 


ఈ మేరకు ఏపి సిఐడి అడిషనల్ డైరెక్టర్ పివి సునీల్ కుమార్  ఐ టీ చీఫ్ కమిషనర్ కు లేఖ రాయడం ...ఈ లేఖ ద్వారా ఐటీ శాఖ రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఐటి చీఫ్ కమిషనర్ సునీల్ కుమార్ కోరారు. 166 మంది 2018 నుంచి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని సూచించారు. అలాగే అప్పటి నుంచి  జరిగిన అనుమానిత బ్యాంకు లావాదేవీలపైనా విచారణ చేయాలని అధికారులకు సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.


 ఏపీలో అసైన్డ్ భూములు కొనుగోలు పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 106 మంది అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వ్యక్తులకు సంబందించిన పూర్తి వివరాలు సర్వే నెంబర్లతో సహా సిఐడి ఐటీ శాఖకు పంపించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం ఉండడంతో అమరావతి పరిసర ప్రాంతాలలో భూములు కొనుగోలు చేసిన టిడిపి నాయకుల్లో ఆందోళన మొదలైంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: