ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని గత రెండు నెలలపై నుంచి రాజధాని అంశం నడిపిస్తున్న విషయం తెలిసిందే. గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన అమరావతిలో ప్రతికూల పరిస్థితులు కావొచ్చు, చంద్రబాబు అండ్ కొ అక్రమాలకు పాల్పడటం కావొచ్చు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా కావొచ్చు గానీ సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి సిద్ధమై, ఆ మేరకు ముందుకెళుతున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ లాంటి ప్రతిపక్షాలు మాత్రం మూడు రాజధానులు వద్దు మొత్తం రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేస్తూ, ఆందోళనలు చేస్తున్నారు.

 

అటు అమరావతికి భూములు ఇచ్చిన రైతులు రెండు నెలల నుంచి తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలని అంటూ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. ఇక ర్యాలీలు వల్ల ఏమైనా శాంతిభద్రత సమస్యలు వస్తాయని పోలీసులు కూడా గట్టిగానే రైతులని ప్రతి ఘటిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులపై లాఠీ చార్జ్‌లు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక రాజధాని తరలి వెళ్లిపోవడం వల్ల కొందరు రైతులు గుండె ఆగి చనిపోయారని వార్తలు కూడా వచ్చాయి.

 

ఇక ఇదే పరిస్తితిని తెలుగు ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అమరావతి ఉద్యమానికి సంబంధించిన పరిస్తితిని తన సినిమాలో చూపించాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పవన్ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం పింక్ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ లాయర్‌గా నటిస్తున్నారు. ఇందులో సమాజానికి ఉపయోగపడే మెసేజ్‌లు బాగానే ఉన్నాయని తెలుస్తోంది.

 

ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న అమరావతి ఉద్యమాన్ని తన సినిమాలో చూపించాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఈ మేరకు డైరక్టర్‌కు చెప్పి, అమరావతి ఉద్యమాన్ని ఓ సీన్‌లో తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి చూడాలి పవన్ అమరావతి ఉద్యమాన్ని సినిమాలో ఎలా వాడుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి: