అవినీతి రహిత సమాజ నిర్మాణంలో అధికారులే ముందుండాలి. సుపరిపాలన ద్వారా సమగ్ర, సుస్థిరాభివృద్ధికి బాటలు వేయాలి. పేదరికం, నిరక్షరాస్యత, లింగ వివక్షను నిర్మూలనపై దృష్టిపెట్టండి. ఆలిండియా సర్వీసులు, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసు అధికారులకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. గ్రామాభివృద్ధి ద్వారానే రామరాజ్యం సాధ్యమన్న మహాత్ముని బోధనల్లోని సారాన్ని అర్థం చేసుకోవాలని.. పల్లెల్లో కనీస సౌకర్యాలను కల్పించే విషయంలో ప్రత్యేక చొరవతీసుకోవాలని సూచించారు. సామాన్య మానవుడి జీవన ప్రమాణాలు పెంచడాన్ని, గ్రామీణాభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో అఖిలభారత సర్వీసులు, సివిల్ సర్వీసులు, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసు అధికారుల ఫౌండేషన్ కోర్సు సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. 


 ‘సివిల్ సర్వెంట్స్‌కు ప్రజాసేవే పరమావధికావాలి. ఇందుకోసం అనుక్షణం నీతి, నిజాయితీలతో పనిచేయాలి. ఏదో ఉద్యోగం చేస్తున్నాం కదా అని అనుకోకుండా.. ప్రజాసేవను బాధ్యతగా భావించండి’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. అవినీతి చీడను పారద్రోలి సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారానికి బాటలు వేయాల్సిన బాధ్యత సివిల్ సర్వీసెస్ అధికారులదేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సుపరిపాలన ద్వారా దేశ సమగ్ర, సుస్థిరాభివృద్ధికి కృషి చేయాలని ఆయన అధికారులకు పిలుపు నిచ్చారు. ‘దేశ రక్షణ వ్యవస్థ, అనుబంధ రంగాల్లో మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ వ్యవస్థ కీలకమైంది. మిలటరీ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశ రక్షణ వ్యవస్థలోభాగస్వాములయ్యే అవకాశం దొరుకుతుంది. ఈ వ్యవస్థలోనూ అవినీతికి తావు లేకుండా.. లక్ష్యాలను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయడంలో మీరు చొరవ తీసుకోండి’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.


దేశాన్ని పట్టిపీడిస్తున్నపేదరికం, నిరక్షరాస్యత, కుల, మత, లింగ వివక్షలను పారద్రోలడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతుల కల్పనను ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుని పనిచేయాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు సుపరిపాలనే సరైన మార్గమని.. సంక్షేమపథకాలను సమర్థవంతంగా లబ్ధిదారులకు చేర్చే అంశంలో వినూత్న పద్ధతులను ఆచరించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అధికారులే వారథి. ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడం, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించి.. వాటి పరిష్కారానికి చొరవతీసుకోవడంలో మీ పాత్ర కీలకం’ అని అన్నారు.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వేర్వేరు అంశాలు, కార్యక్రమాలను సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వర్తించే గురుతర బాధ్యత సివిల్ సర్వీసెస్ అధికారులపైనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ బీపీ ఆచార్య, కోర్స్ డైరెక్టర్ హర్‌ప్రీత్ సింగ్, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ సీఈ బ్రిగేడియర్ పీకేజీ మిశ్రా పలువురు అధికారులు, ఫౌండేషన్ కోర్సుకు హాజరైన అఖిలభారత, కేంద్ర సర్వీసుల అధికారులు, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: