తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. కడప తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడి నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు చంద్రబాబుకు సీఎస్ గా పనిచేసిన అధికారి నివాసాలపై దాడులు జరుగుతున్నాయి. ఇంకో వైపు.. నారా లోకేశ్ కు సన్నిహితుడుగా పేరున్న కిలారు రాజేశ్ ఇళ్లపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి.

 

 

సాధారణంగా ఇలాంటి ఐటీ దాడులు జరిగే సమయంలో చంద్రబాబు రెచ్చిపోతుంటారు. ఇలా దాడులు చేస్తారా అంటూ ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టేవారు. రచ్చ రచ్చ చేసేవారు. కానీ.. ఈసారి ఓ వైపు కీలకమైన వ్యక్తులపై ఐటీ దాడులు జరుగుతున్నా.. ఏమాత్రం శబ్దం చేయడం లేదు. ఇవేం దాడులంటూ హడావిడి చేయడం లేదు. ఇప్పుడు ఈ మౌనం అనేక ఆసక్తి కరమైన కోణాలను ఆవిష్కరిస్తోంది. గుట్టు రట్టవుతోందనే చంద్రబాబు మౌనం వహిస్తున్నారా..?

 

 

ఇప్పుడు స్పందిస్తే.. అసలుకే మోసం వస్తుందని భావిస్తున్నారా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే.. విజయసాయిరెడ్డి మాత్రం ఈ అంశంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పుడూ తప్పుడు మాటలతో వార్తల్లో నిలిచే చంద్రబాబు ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నా సైలెంట్‌గా ఉన్నారెందుకని.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు ప్రశ్నించారు. చంద్రబాబుపై ట్విట్టర్‌ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

 

 

మాజీ పీఏతో పాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరువిప్పడం లేదు. నిప్పు కణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని ఐటీ శాఖను నిలదీయాలి. రెండ్రోజులుగా కిక్కురుమనకుండా, కియా లేచిపోతోందని ఫేక్‌ వార్తలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు’అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఎంతైనా విజయసాయి రెడ్డి విమర్శల్లో లాజిక్ కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: