పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, అసెంబ్లీ తీర్మానం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చ‌ట్టం అమ‌లు చేయ‌బోమంటూ...ఆయా వేదిక‌లు ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే, తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) సంచ‌ల‌న తీర్మానం చేసింది. (సీఏఏ)కు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. దేశంలో ఇలా తీర్మానించిన మొదటి మున్సిపల్‌ కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ నిలిచింది. 2020-21ఆర్థిక సంవత్సరానికిగాను రూ.6,973.00 కోట్ల అంచనాతో రూపొందించిన బల్దియా వార్షిక బడ్జెట్‌ను కూడా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది.

 

హైద‌రాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన బల్దియా వార్షిక బడ్జెట్‌పై శనివారం ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఏ వంటి చట్టాలు దేశంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌, మజ్లిస్‌ సభ్యులు, మాజీ మేయర్‌ మాజిద్‌హుస్సేన్‌, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ సింగిరెడ్డి స్వర్ణలత తదితరులు బాబా ఫసియుద్దీన్‌ ప్రతిపాదనను బలపరుస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం సభ్యులంతా బల్లలు చరుస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

 

సభ్యులంతా సీఏఏను వ్యతిరేకిస్తున్నందున ఈ మేరకు తీర్మానం చేసినట్టు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ఈ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన టీఆర్ఎస్ కార్పొరేట‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ బాబా ఫ‌సీయుద్దీన్ మాట్లాడుతూ...దేశంలో లౌకికవాద స్ఫూర్తిని దెబ్బతీసేలా రూపొందించిన సీఏఏను వ్యతిరేకించాలని కోరారు. హిందూ, ముస్లింలు కలిసికట్టుగా జీవిస్తున్నారని కానీ, కేంద్ర ప్రభుత్వం విభేదాలు సృష్టించేలా చీకటి చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్లమెంటులో సీఏఏను వ్యతిరేకించినందున బల్దియాలో సైతం దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశామ‌ని ఇందుకు ఆమోదించ‌నందుకు ధ‌న్య‌వాదాల‌ని తెలిపారు.  కాగా, వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ఈ తీర్మానం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: