రకరకాల కేటుగాళ్లు ఉంటారు.. ఎలాంటి కేటుగాళ్లతో అయినా నిజం కక్కిచటం... వాళ్లను వంచటం పోలీసులకే చెల్లుతుంది. అలాంటి పోలీసులకే షాక్ ఇచ్చాడు కేటుగాడు.. పైగా ఆ కేటుగాడు షాక్ ఇచ్చింది అలాంటి ఇలాంటి పోలీసులకు కాదు హైదరాబాద్ పోలీసులకు. హైదరాబాదులో ప్రతిరోజూ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. వీరిలో మహామహుల పిల్లలను సైతం పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించడం లేదా... కౌన్సిలింగ్ ఇవ్వడం సహజంగా జరుగుతూ ఉంటుంది.
బడా బడా సినిమా సెలబ్రిటీల వారసులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల వారసులను సైతం డ్రంక్ అండ్ డ్రైవ్ లో హైదరాబాద్ పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసుల పై తిరగబడిన సెలబ్రిటీల విషయంలో సైతం హైదరాబాద్ పోలీసులు లెక్కచేయలేదు, అయితే ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకే షాక్ ఇచ్చాడు ఓ వ్యక్తి.
గత రాత్రి హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహస్తుండగా, పోలీసులకే మస్కా కొట్టి పారిపోయాడో మందుబాబు. శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 34 కార్లు, 47 బైక్ లు, 4 ఆటోలు నడుపుతున్న వారు మద్యం తాగి ఉన్నారని పోలీసులు తేల్చారు. వారందరి వాహనాలనూ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు జూబ్లీహిల్స్ వద్ద తనిఖీలు చేస్తుండగా, ఓ కారును నడుపుకుంటూ అక్కడకు వచ్చాడు ఓ యువకుడు.
పోలీసులు వెంటనే ఆ వ్యక్తి కారును ఆపి టెస్ట్ చేశారు. ఆ యువకుడికి బ్రీత్ అనలైజర్ లో ఊదుతున్నట్టు నటిస్తూ, కారును వేగంగా తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటనలో కారు ముందున్న మరో రెండు బైకులనూ ఢీకొట్టాడు. కారు నంబర్ ను లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు, అతనిపై ఫిర్యాదు చేశారు.