ఢిల్లీని మళ్లీ చీపురు ఊడ్చేయడం ఖాయమా?  అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ ఆప్‌కే అనుకూలంగా ఉన్నాయి. దీంతో సామాన్యుడే  మళ్లీ ఢిల్లీ పీఠం ఎక్కబోతున్నాడని అంటున్నారు. అయితే... ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారవుతాయని బీజేపీ అంటోంది. కాషాయ రెపరెపలు ఖాయమంటోంది. 

 

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ఎన్నికల్లో మళ్లీ  ఆమ్‌ ఆద్మీ పార్టీయే ఢిల్లీ పీఠం దక్కించుకుంటుందని సర్వేలు తేల్చాయి. ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆప్‌, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ  నేపథ్యంలో దేశంలోని జాతీయ ఛానళ్లు, సంస్థలు నిర్వహించిన సర్వేల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు ఆప్‌ చేతుల్లో భంగపాటు తప్పదని సర్వేలు సూచిస్తున్నాయి. ఢిల్లీ  అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల కంటే ఎక్కువే గెలిచి ఆప్‌ మరోసారి అధికారంలోకి వస్తుందని తెలిపాయి. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలు  వెల్లడికానున్నాయి. 


 
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దే విజయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కేజ్రీవాల్ కే పట్టం కట్టాయి. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ లో కూడా ఆమ్  ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 44 స్థానాలు, బీజేపీకి 26 స్థానాలు వస్తాయని చెప్పింది. కాంగ్రెస్ ఖాతా తెరవదని టైమ్స్ నౌ తేల్చేసింది.

 

ఏబీపీ ఎగ్జిట్ పోల్ కూడా కేజ్రీవాల్ మరోసారి సీఎం అవుతారని స్పష్టం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 35 నుంచి 45 స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 4 నుంచి  14 సీట్లకే పరిమితమవుతుందని తేల్చింది. కాంగ్రెస్ సున్నా నుంచి 3 స్థానాలు గెలుచుకోవచ్చని జోస్యం చెప్పింది. ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ కూడా ఆప్ కే పట్టం కట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 44 స్థానాలు, బీజేపీకి 26 స్థానాలు వస్తాయని తేల్చింది. కాంగ్రెస్ గురించి అసలు ఈ  ఎగ్జిట్ పోల్ ప్రస్తావించలేదు.

 

సుదర్శన్ టీవీ ఎగ్జిట్ పోల్ కూడా ఆమ్ ఆద్మీ విజయం ఖాయమని చెప్పేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 40 నుంచి 45 స్థానాలు వస్తాయని తేల్చింది. బీజేపీకి 24  నుంచి 28 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 2 నుంచి 3 స్థానాలే దక్కుతాయని చెప్పింది.

 

న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్ కూడా ఢిల్లీ పీఠం సామాన్యుడి పార్టీదేనని చెప్పింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 53 నుంచి 57 స్థానాలు వస్తాయని తేల్చింది. బీజేపీకి 11 నుంచి  17 సీట్లు వస్తాయని చెప్పింది. కాంగ్రెస్ కు సున్నా నుంచి 2 సీట్లే వస్తాయని అంచనా వేసింది. 

 

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ కూడా కేజ్రీవాల్ మళ్లీ సీఎం అవుతారని తేల్చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 44 స్థానాలు దక్కుతాయని చెప్పింది. బీజేపీకి 26 స్థానాలు  వస్తాయని తేల్చింది. కాంగ్రెస్ గురించి అసలు ప్రస్తావించలేదు. 

 

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ కేజ్రీవాల్ మళ్లీ సీఎం అవుతారని అంచనా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 55 స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 15 సీట్లు  గెల్చుకుంటుందని తెలిపింది. కాంగ్రెస్ గురించి ప్రస్తావన కూడా చేయలేదు.

 

రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ కూడా ఆప్ కే పట్టం కట్టింది. ఢిల్లీలో సామాన్యుడి పార్టీకి బంపర్ మెజార్టీ వస్తుందని తేల్చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 48 నుంచి 61 సీట్లు  వస్తాయని చెప్పింది. బీజేపీకి 9 నుంచి 21 సీట్లు రావచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్ సున్నా నుంచి ఒక్క స్థానమే దక్కుతుందని జోస్యం చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: