ఏపీలో జగన్ సర్కార్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు..?  ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన ప్రభుత్వం... ఆ తర్వాత ఎవరిపై దృష్టి పెట్టబోతోంది.  టీడీపీ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన వారిని అప్రాధాన్యత పోస్టులకు పరిమితం చేసిన జగన్ సర్కార్... ఇప్పుడు ప్రత్యక్ష చర్యలకు శ్రీకారం చుట్టింది. ఏబీ వ్యవహారాన్ని సస్పెండ్ చేయడంతోనే ముగిస్తుందా? ఇంకొంచెం ముందుకు వెళ్తుందా? ఏబీ తర్వాత అదే స్థాయిలో తమను ఇబ్బందిపెట్టిన మరో సీనియర్ ఐపీఎస్ అధికారిపైనా ప్రభుత్వం వేటుకు సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది.   

 

టీడీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై... వైసీపీ సర్కార్ సస్పెన్షన్ వేటేయడం రాజకీయ,  పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఏబీ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ కావడానికి కథ, స్క్రీన్ ప్లే ఏబీదేనని వైసీపీ ఇప్పటికీ చెబుతోంది. సీన్ కట్ చేస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏబీని జీఏడీకి అటాచ్ చేసింది.  ఏ పోస్టూ లేకుండా ఖాళీగా కూర్చోబెట్టింది. అయితే అప్పటి నుంచి జీఏడీకి ఏబీ వెళ్ళటం లేదట. అంతేకాకుండా ఇంకా టీడీపీ వ్యవహారాలను చక్కబెడుతున్నారనే ఆరోపణ కూడా ఉంది. మొత్తం మీద డిపార్ట్ మెంట్‌కు పరికరాలను కొనటం, అది కుమారుడి పేరు మీద చేశాడంటూ వైసీపీ ఏబీని సస్పండ్ చేసింది.

 

ఏబీ వ్యవహారాన్ని జగన్ సర్కార్ అంతా ఆషామాషీగా తీసుకోవటంలేదట. ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు నిర్వహించిన సమయంలో చేసిన అన్ని వ్యవహారలపై ఒక నివేదికను సిద్ధం చేస్తోందట. ఇప్పటికే టీడీపీ హయాంలో పనిచేసిన ఐఆర్ఎస్  అధికారి జాస్తి కృష్ణకిషోర్ ను  సస్పెండ్ చేసిన ప్రభుత్వం, ఆ విచారణను సీఐడీకి అప్పగించింది. ఇదే విధంగా ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు కేసును కూడా సీఐడీకి లేదా అంతకు మించిన దర్యాప్తు సంస్థకు ఇచ్చే ఆలోచనలో ఉందని సమాచారం. 

 

మరోవైపు, ఏబీ సస్పెన్షన్ తర్వాత మరో సీనియర్ ఐపీఎస్ అధికారిపై కూడా చర్యలు తీసుకోవటానికి జగన్ సర్కారు సిద్ధమవుతోందని సమాచారం.  టీడీపీ హయాంలో. పోలీస్ శాఖ ఉన్నతాధికారిగా పనిచేసి ప్రస్తుతం అప్రాధాన్యత  పోస్టుకు పరిమితమైన ఓ అధికారి,  నెక్ట్స్ వికెట్ అనేది ఐపీఎస్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఆయన హయాంలో జరిగిన తప్పిదాలతోపాటు...ఏబీ అక్రమాల్లో  ఆ అధికారి పాత్ర ఎంత ఉంది? ఏమిటన్నదీ తవ్వుతున్నారట. జగన్ మీద కోడి కత్తి దాడి జరిగిన సమయంలో ఆ అధికారు చేసిన ప్రకటనలు, వ్యవహరించిన తీరుపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న సర్కారు....  టీడీపీ ఏజెంట్లుగా పని చేసిన ఏ  ఒక్కరినీ వదలకుండా వడ్డిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల్లో  ఆ ఐపీఎస్ వికెట్ పడడం ఖాయమని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: