థాయ్‌లాండ్‌లో ఉన్మాదిలా మారిన ఓ సైనికుడు ఘాతుకానికి పాల్పడ్డాడు.  విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ..21 మందిని బలి తీసుకున్నాడు. దాడిలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని పరిణామంనుంచి తేరుకున్న ఆర్మీ అధికారులు అతడిని కాల్చి చంపారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది.  


 
థాయ్‌లాండ్‌లో ఓ సైనికుడు ఉన్మాదిలా మారి 21 మంది ప్రాణాలు తీశాడు. మిలటరీ క్యాంప్‌లో ఉన్నతాధికారిని కాల్చి చంపి ఆయుధాలు దొంగిలించిన జక్రపంత్‌ తొమ్మా అనే సైనికుడు ఓ షాపింగ్ మాల్‌లో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

 

 32 ఏళ్ల జక్రఫంత్  తన కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ తో పాటు అక్కడే ఉన్న మరో అధికారిని చంపేశాడు.  క్యాంప్ నుండి పారిపోయే ముందు ఓ రైఫిల్, మందుగుండు సామాగ్రి, మరికొన్ని ఆయుధాలను ఎత్తుకుపోయాడు.  

 

సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కోరట్ సిటీలోని టోర్మినల్ 21 షాపింగ్ సెంటర్ దగ్గరకు వచ్చిన ఉన్మాది జక్రఫంత్  మాల్ లో ఉన్న కస్టమర్లపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు. దీంతో మాల్‌లో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. సైనిక దుస్తుల్లో ఉండటంతో అతని వల్ల ప్రమాదం ఉంటుందని ఎవరూ అనుమానించలేదు. ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఎటాక్ సమయంలో ఫేస్ బుక్ లో అప్ డేట్స్ పోస్ట్ చేశాడు జక్రఫంత్.

 

ఊహించని పరిణామం నుంచి తేరుకున్న పోలీసులు...వెంటనే పెద్ద సంఖ్యలో  షాపింగ్ సెంటర్ ను చుట్టుముట్టారు. మరికొందరు భవనంలోకి ప్రవేశించి లోపల ఉన్నవారికి తప్పించుకోవడానికి సహాయం చేశారు. షాపింగ్ సెంటర్ నాలుగో అంతస్తులో జక్రాఫాంత్ ఉన్నట్లు నిర్ధారించుకున్నారు అధికారులు. అతను లోపల బందీలను పట్టుకున్నట్లు గుర్తించారు.  షాపింగ్ సెంటర్ లోపల చిక్కుకున్నవారు బాత్రూమ్ క్యూబికల్స్, టేబుల్స్ కింద దాక్కున్నారు. పోలీసు అధికారులు జక్రాఫాంత్ తల్లిని కలుసుకుని, ఆమెను షాపింగ్ సెంటర్‌కు తీసుకువచ్చారు. ఆమె ద్వారా అతన్ని లొంగిపోయేలా ఒప్పించే ప్రయత్నం చేశారు .  ఎన్ని సార్లు చెప్పినా అతను మాట వినలేదు.   షాపింగ్ మాల్‌లో మరికొంతమందిపై కాల్పులు జరిపే ప్రమాదం ఉండటంతో అతడిని కాల్చి చంపేశారు థాయ్ పోలీసులు.


   
ఉన్మాది కాల్పుల్లో  16 మంది మరణించగా, మరో  ఐదుగురు హాస్పిటల్ లో మృతి చెందినట్టు తెలుస్తోంది.  తుపాకీ గుళ్ల వర్షంతో ఘటనాస్థలం యుద్ధభూమిని తలపించింది. మృతులు, గాయపడిన వారితో ఆ ప్రాంతం భయానకంగా మారింది. మృతుల సంఖ్య  పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో లైసెన్డ్స్‌ గన్‌లు కలిగి ఉన్న దేశాల్లో ఒకటైన థాయ్‌లాండ్‌లో.. భద్రతా సిబ్బంది కాల్పులకు దిగడం  కలకలం రేపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: