రేషన్‌ కార్డులనే కాన్సెప్టు ఇప్పుడు పోయిందని పౌరసరఫరాల శాఖ మంత్ర కొడాలి వెంకటేశ్వర రావు (నాని) తెలిపారు. బియ్యం పొందడానికి మరింత మెరుగైన విధానం ఇప్పుడు అమల్లోకి వచ్చింది. చాలా మంది బియ్యం తీసుకోకపోవడం, ఆ బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకోవడం, తీసుకున్న బియ్యం నాణ్యత తక్కువగా ఉండడం, అవి తినలేని పరిస్థితుల్లో అమ్ముకుంటున్న తీరు నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కొత్తగా బియ్యం కార్డులను తీసుకు వచ్చిందన్నారు. ఈ బియ్యం కార్డులతో పెన్షన్‌లకుగాని, ఆరోగ్యశ్రీ కాని, ఫీజు రియింబర్స్‌ మెంట్‌ లాంటి పథకాలకు ముడిపెట్ట లేదు.  ఏ పథకం అర్హతలు ఆ పథకానికి ఉన్నాయి. ఈనేపథ్యంలో బియ్యం కార్డులను ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. 


రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని అదనంగా ఖర్చుచేసి, ప్యాక్‌ చేసి మరీ ప్రభుత్వం ఇస్తోంది. ఏప్రిల్‌ నుంచి అన్ని జిల్లాల్లో దశలవారీగా నాణ్యమైన బియ్యం పంపిణీకి ప్రయత్నాలు మొదలుపెట్టింది. వైయస్సార్‌ నవశకం కార్యక్రమం ద్వారా బియ్యం కార్డుకోసం అర్హులను గుర్తించింది.  ప్రతి యాభైఇళ్లకు నియమించబడ్డ గ్రామ, వార్డు వాలంటీర్‌ ప్రతి ఇంటికీ వెళ్లి.. అర్హులను గుర్తించారు. రాష్ట్రంలో వైట్‌ రేషన్‌ కార్డులు 1,47,23,567 ఉంటే.. ఇందులో సుమారు 10 లక్షలమంది అసలు బియ్యాన్ని తీసుకోవడంలేదు. మరికొంతమంది అనర్హులుగా తేలారన్నారు. ప్రతి ఇంటికీ గ్రామవాలంటీర్‌ వెళ్లి అర్హతల పత్రాన్ని వారికి అందించి, వారి నుంచి వివరాలు తీసుకొన్నారు. ఆమేరకు ఆయా కుటుంబాల వారు అంగీకారం కూడా తెలిపారు. ఈమేరకు సిద్ధం చేసిన జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు. అర్హులు ఎవరు? అనర్హులు ఎవరు అన్న జాబితాను ప్రజల ముందే ఉంచి, సోషల్‌ ఆడిట్‌ జరిపామన్నారు.

 

 ఒకవేళ అర్హత ఉండీ, పేరు లేకపోయినా ఎవరికి దరఖాస్తు చేయాలన్నదానిపై వివరాలు కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే చేశారు. ఈ రకంగా దాదాపు 2 లక్షల మంది నుంచి గ్రామ సచివాలయాల్లో డిస్‌ప్లేచేసిన జాబితాలపై అభ్యంతరాలు, విజ్ఞాపనలు వచ్చాయి. ఈ  2 లక్షలమంది నుంచి వచ్చిన విజ్ఞాపనలను అధికారులు పునః పరిశీలన చేస్తున్నారు.  మరోవైపు బియ్యం కార్డు పొందేందుకు అర్హతలు లేవని తెలిపిన వారి వివరాలపై కూడా అధికారులు మరోసారి పునఃపరిశీలన చేస్తున్నారు.  ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అన్నది ఈ పునఃపరిశీలన తర్వాతే తేలుతుంది. పైగా గత ప్రభుత్వంతో పోలిస్తే బియ్యం కార్డు పొందేందుకు అర్హతలను సడలించి మరింతమందికి ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. ఇన్ని బియ్యం కార్డులు మాత్రమే ఇవ్వాలి, ఇంత మందికి మాత్రమే ఇవ్వాలన్న షరతును ప్రభుత్వం ఎక్కడా పెట్టలేదు. అర్హులు ఎంతమంది ఉంటే, అంతమందికీ కార్డులు మంజూరుచేయాలని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ స్వయంగా అధికారులకు పలుమార్లు స్పష్టంచేశారు.  

 

అర్హత ఉన్నవారికి పథకాలు పొందడం ఒక హక్కని ఆయన స్పష్టంచేశారు. బియ్యం కార్డుల జారీ అనేది ఇప్పటితో నిలిచిపోయే ప్రక్రియ కాదు. అది నిరంతరం కొనసాగే ప్రక్రియ.  పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు ప్రతి 2వేల జనాభాకు ఒకటిచొప్పున అందుబాటులో ఉన్నాయి. వీటిలో అర్హత ఉన్నవారు ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు నిర్దేశించిన   541 సర్వీసుల్లో బియ్యం కార్డు కూడా ఒకటి. బియ్యం కార్డుకోసం దరఖాస్తు చేసిన 5 రోజుల్లోగా అర్హులకు మంజూరుచేస్తారు.  ప్రతిరోజూ గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం ఉంటుంది. దీనిద్వారా ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంతో పోలిస్తే ఈ అర్హతలను బాగా సడలించారు కూడా. 

 

బియ్యంకార్డు అర్హతలు.. నాడు , నేడు..


1. గతంలో రేషన్‌ ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 ఆదాయం ఉన్నవారికే వర్తిస్తుందని నిబంధనలు పెట్టారు. తాజాగా ప్రభుత్వం దీన్ని సడలించింది. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.12 వేలు లోపు ఉన్నవారికి వర్తించేలా మార్పు చేశారు. గతంలో అర్హులై రేషన్‌ దక్కని వారినుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వం మళ్లీ కార్డులు జారీచేస్తుంది. 

 

2. 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల్లోపు మెట్ట భూమి ఉన్నవారు మాత్రమే అర్హులని ప్రకటిస్తే.. ఈ పరిమితులను కూడా సడలించింది. 3 ఎకరాల మాగాణి లేదా, 10 ఎకరాల్లోపు మెట్ట ఉన్నవారికీ, లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉన్నవారికి వర్తిస్తుందని ప్రభుత్వం తాజా నిబంధనల్లో పేర్కొంది. 

 

3. గతంలోæరేషన్‌ పొందాలంటే  నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌  వినియోగం ఉంటేనే అర్హులు. కాని దీన్ని సడలిస్తూ నెలకు సరాసరి సగటు 300 యూనిట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

 

4. ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులని గతంలో పేర్కొన్నారు. అలాగే ఉద్యోగ పెన్షన్‌ తీసుకుంటున్నవారు అనర్హులని నిబంధనల్లో పొందుపరిచారు. అయితే పారిశుద్ధ్యకార్మికులుగా పనిచేసివారికి ఈసారి నిబంధనలనుంచి మినహాయింపు ఇచ్చారు. 


5. గతంలో నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు అనర్హులు. ట్యాక్సీలు నడుపుకుంటున్నవారికి మినహాయింపు. ఈసారి ట్యాక్సీలే కాకుండా ఆటోలు, ట్రాక్టర్లు నడుపుకుంటున్న వారికీ మినహాయింపును ఇచ్చారు.
 6. ఆదాయపు పన్ను పరిధిలో లేనివారు, అర్బన్‌ ప్రాంతాల్లో 1000 
స్క్వేర్‌ఫీట్‌ లోపు ఉన్నవారు అర్హులు.

మరింత సమాచారం తెలుసుకోండి: