చంద్రబాబూ.. నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరు. కియా పరిశ్రమపై చంద్రబాబు కుట్ర రాజకీయాలు తగదు.  రాయిటర్స్‌తో తప్పుడు వార్తలు రాయించి దుష్ప్రచారం. దగాకోరు రాజకీయాలు మానుకో.  ఫ్యాక్టరీ ఎక్కడికీ పోదని యాజమాన్యం చెప్పినా పట్టదా అని నిలదీశారు. పార్లమెంట్‌లో అసత్య వార్తలను ప్రస్తావిస్తారా అని ప్రశ్నించారు.  అబద్ధాలు మాట్లాడవద్దనే టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ను కోరా టీడీపీని బతికించుకోవడానికే చంద్రబాబు ప్రయత్నమని మీడియా సమావేశంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ విమర్శించారు. కియా మోటార్స్‌పై అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు అదే ఫ్యాక్టరీ వద్దకు వచ్చి తన ముక్కును నేలకు రాసి క్షమాపణ కోరాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ డిమాండ్‌ చేశారు.

 

చంద్రబాబే కుట్ర చేసి రాయిటర్స్‌ ద్వారా తప్పుడు వార్తలు రాయించారని ఆరోపించారు. రాయిటర్స్‌ కథనంలోనే ఫ్యాక్టరీ ఎక్కడికీ తరలించడం లేదన్న యాజమాన్యం వివరణ ఉందని, దాన్ని చదువుకోవడం కూడా రాదా? అని ప్రశ్నించారు. కియా మోటార్స్‌ తరలింపు వార్తలు, పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలు, రాయలసీమ కరువుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తూ ఆదివారం అనంతపురంలోని తన స్వగృహంలో ఎంపీ మాధవ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతంగా పరిపాలన చేస్తుంటే చూసి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, తాను సజీవంగానే ఉండి సీఎం జగన్‌ హత్య చేశారంటూ ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే రకమని అన్నారు.

 

రాష్ట్రంలో అద్భుత పాలన సాగుతోందని, ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై బురదజల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. అపద్ధపు వార్తను పార్లమెంట్‌లో ప్రస్తావింపజేసి ఆ అబద్ధాన్ని నిజం చేయాలని యత్నించి భంగపడ్డారని అన్నారు. పార్లమెంట్‌లో అసత్యాలు మాట్లాడవద్దని చెప్పడానికే టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు వద్దకు వెళ్లానే గానీ బెదిరించడానికి కాదని స్పష్టం చేశారు. కియా ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విషయంపై గతంలో సంస్థ ప్రతినిధులతో తాను మాట్లాడితే మీడియా వక్రీకరించిందని, దీన్ని కూడా రాజకీయంగా చంద్రబాబు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఓ రాజకీయ వ్యభిచారి అని వ్యాఖ్యలు చేశారు.

 

ప్రతి విషయంలోనూ చంద్రబాబుది ద్వంద్వ వైఖరేనని, దివాళాకోరు రాజకీయాలను ఆయన మానుకోవాలని హితవు పలికారు. నిత్యం దుర్భిక్షంతో తల్లడిల్లే రాయలసీమకు ఎక్కువ శాతం ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కోరుతానని, ఏపీలో అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ ఆవశ్యకమన్నారు. సీమలో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ను స్వాగతిస్తున్నానని, అన్ని జిల్లాల మేలు కోసమే వైఎస్‌ జగన్‌ అధికార వికేంద్రీకరణ చేస్తున్నట్లు చెప్పారు. గత ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు టీడీపీకి 23 ఎమ్మెల్యేలు, మూడు ఎంపీ స్థానాలు వచ్చాయని, ఆ పార్టీని బతికించుకోవడం కోసమే చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: